వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఈ పరిస్థితి



  రోజురోజుకూ పంట నష్టం పెరుగుతోంది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో దాదాపు 14 లక్షల ఎకరాలకు పైగా పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఈ వారంలో మొదటి మూడు రోజుల్లో 8 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లగా, ఆ తర్వాత 12 లక్షల ఎకరాలకు చేరిందని వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. అయితే బుధవారం నాటికి అది కాస్తా 14 లక్షల ఎకరాలకు చేరి ఉండొచ్చని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అయితే తుది నివేదిక ఇంకా రావాల్సి ఉందని పేర్కొంటున్నారు. గత వారం రోజులుగా కురిసిన వర్షాలకే ఇంత నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. అయితే ఈ వివరాలను అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. వరి దాదాపు 5,10,216 ఎకరాలు, పత్తి 7,50,150 ఎకరాలు, ఇంకా ఇతర పంటలు కలిపి 14,06,110 ఎకరాలు దెబ్బతిన్నట్లు సమాచారం. ఓ అంచనా ప్రకారం దాదాపు 7,60,138 మంది రైతులు పంటలు నష్టపోయినట్లు తెలిసింది. అయితే నష్టం రూ.వేల కోట్లలో ఉంటుందంటున్నారు. అన్నదాత గగ్గోలు..: వరి, పత్తికి కనిష్టంగా రూ.25 వేలు, గరిష్టంగా రూ.35 వేల చొప్పున రైతులు పెట్టుబడి పెట్టారు. వరదలు, వర్షాలతో పెట్టుబడి మొత్తం కోల్పోయే పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఈ పరిస్థితుల్లో నష్ట పరిహారం అందజేయలని కోరుతున్నారు. కాగా, ఈ ఏడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం.. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) పథకం నుంచి వైదొలిగింది. దీంతో పంటల బీమా కూడా అందే దిక్కు లేకుండా పోయిం ది.