డిసెంబర్ 1 నుంచి వరద సాయం పంపిణీ చేయనున్న తెలంగాణ ప్రభుత్వం

 


టీఆర్ఎస్ పార్టీ గ్రేటర్‌ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తోన్న భారీ బహిరంగసభలో పార్టీ ఆధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటున్నారు. సీఎం మీటింగ్ నేపథ్యంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంకు జనం పెద్దఎత్తున చేరుకుంటున్నారు. నగరంలోని అన్ని డివిజన్ల నుంచి పార్టీ కార్యకర్తలు, ప్రజలు తరలివస్తున్నారు. గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్‌ పాల్గొంటున్న మొదటిది.. ఏకైక బహిరంగసభ కావడంతో టీఆర్‌ఎస్‌ నేతలు ఈ మీటింగ్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా సభా ఏర్పాట్లను పూర్తి చేశారు. స్టేడియంలో మొత్తం మూడు స్టేజ్ లు ఏర్పాటు చేశారు. ఒకటి కేసీఆర్ ప్రసంగించే వేదికకాగా, ఒకటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి కార్పొరేటర్లుగా పోటీచేస్తున్న 150 మంది అభ్యర్థులు ఒక వేదిక మీద ఉండగా, మరో వేదిక మీద సాంస్కృతిక కార్యక్రమాలకు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈ ఆరేళ్ల కాలంలో హైదరాబాద్ ప్రగతి నివేదిక, తెలంగాణ అభివృద్ధి ప్రణాళికలను కేసీఆర్ ప్రజలకు వివరించనున్నారు. బహిరంగ సభ దగ్గర మాస్కులు, శానిటైజర్లను సిద్ధంగా ఉంచారు. ఇవాళ ప్రధాని మోదీ నగర పర్యటన నేపథ్యంలో కేసీఆర్‌ వ్యాఖ్యలపై అన్నిపార్టీల నుంచి కూడా ఆసక్తి నెలకొంది. సీఎం కేసీఆర్‌ సభ నేపథ్యంలో ఎల్బీ స్టేడియం మీదుగా వెళ్లే వాహనాలను ట్రాఫిక్‌ పోలీసులు దారి మళ్లించారు. కేసీఆర్ మీటింగ్ మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ మీకోసం ఈ దిగువున.. డిసెంబర్ 1న నడుంకట్టాలి. . హైదరాబాద్ ఇంటలెక్ట్యువల్ పర్సన్స్ కు కేసీఆర్ విన్నపం హైదరాబాద్ ఇంటలెక్ట్యువల్ పెర్సన్ కు కేసీఆర్ ప్రత్యేకంగా విన్నపం చేశారు. ఇదే సమయమని.. దయచేసి మీ స్థానిక ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడంతోపాటు, ఓటు వేసేందుకు తరలి వచ్చి హైదరాబాద్ భవిష్యత్ కు దోహదపడాలని కేసీఆర్ కోరారు. హైదరాబాద్ భద్రత, మతసామరస్యం, అభివృద్ధి దృష్ట్యా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, ప్రొఫెషనల్ ఉద్యోగులు తప్పకుండా ఎన్నికల్లో పాల్గొని ఓటు వేయాలన్నారు. అంతేకాదు, మీ ప్రాంతంలో కూడా అందరికీ చెప్పి ఓట్లు వేసేందుకు ప్రయత్నించాలని కేసీఆర్ కోరారు. మన పిల్లలు, నగర భవిష్యత్ దృష్ట్యా నగరప్రజలంతా పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొని డిసెంబర్ 1వ తేదీన జరిగే ఎన్నికల్లో తప్పకుండా ఓటు వేయాలని, టీఆర్ఎస్ పార్టీకి పోయిన సారికంటే ఇంకో ఐదారుసీట్లు ఎక్కువిచ్చి తమను దీవించాలని కేసీఆర్ కోరారు. కేంద్రం మెడలు వంచి నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కేసీఆర్ దని ఆయన చెప్పారు. ముఖ్యంగా యువకులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నారు. కేసీఆర్‌ని చూసి గజగజ వణుకుతున్నారు.. పైనుంచి బీజేపీ నేతలు బురదలా బయలుదేరుతున్నారు బక్క కేసీఆర్ ను కొట్టేందుకు అంతమంది నేతలా.. అని కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పై నుంచి బీజేపీ నేతలు వరదలా, బురదలా వస్తున్నారని విమర్శించారు. వాళ్ల రాష్ట్రాలను సరిగా పాలించలేనివాళ్లు ఇక్కడ ప్రచారానికి వస్తు్న్నారంటూ యూపీ సీఎం, బీజేపీ ముఖ్య నేతల్ని ఉద్దేశించి కేసీఆర్ పరోక్ష విమర్శలు చేశారు. హైదరాబాద్ కు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని.. ఇవన్నీ నిలబడాలంటే హైదరాబాద్ లో సామరస్యం తొణికిసలాడాలని కేసీఆర్ అన్నారు. కొంతమంది పిచ్చికార్యక్రమాలు ప్రచారం చేస్తున్నారని, వీటిని హైదరాబాద్ ఓటర్లు దృష్టిలో పెట్టుకోవాలని కేసీఆర్ కోరారు. ఎక్కడినుంచో వచ్చినోడు రేపు మనకూడా ఉంటాడా అని కేసీఆర్ అన్నారు. ఎవ్వడైనా ఇచ్చాడా.! చరిత్రలో ఎక్కడాలేని విధంగా వరదసాయం పదివేలు ఇచ్చాం.. : కేసీఆర్ బీజేపీ పాలిత రాష్ట్రాలు సహా దేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా జంటనగరాల్లో ఆరున్నర లక్షల కుటుంబాలకు వరదసాయంగా పదివేల చొప్పున అందించామని కేసీఆర్ చెప్పారు. డిసెంబర్ 7 ఎన్నికల బ్యాన్ అయిపోయిన తర్వాత మిగిలిన అందరికీ వరదసాయం అందజేస్తామని కేసీఆర్ అన్నారు. వరదల నేపథ్యంలో కేంద్రాన్ని 13వేల కోట్లు సాయం అడిగితే, 13 పైసలు కూడా ఇవ్వలేదని ముఖ్యమంత్రి విమర్శించారు. మిగతా రాష్ట్రాలకు ఇచ్చి తెలంగాణ ప్రజలపట్ల ఎందుకు మీకు వివక్ష అని కేసీఆర్ ప్రశ్నించారు. అందమైన మూసీ.. అన్ని ప్రాంతాలకు మెట్రోరైలు.. బహిరంగ సభలో కేసీఆర్ హామీ సంవత్సరానికి పదివేల కోట్లు హైదరాబాద్ ముంపు నిర్మూలనకు ఖర్చు చేస్తామని కేసీఆర్ చెప్పారు. ఈ వరద భారి నుంచి హైదరాబాదీలకు శాశ్వత విముక్తి కల్పిస్తామని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి సహకరించాలని కేసీఆర్ ప్రజలకు విన్నవించారు. హైదరాబాద్ కాలుష్య నిర్మూలన, మెట్రో రైలు మరికొన్ని ప్రాంతాలకు.. ఎయిర్ పోర్టు వరకూ మెట్రో విస్తరిస్తామని, కాలుష్య నిర్మూలనకు ఎలక్రిక్ వాహనాలకు ప్రోత్సాహం ఇస్తామని కేసీఆర్ చెప్పారు. ఇప్పటికే అనేక నగరాలు కాలుష్యంతో బాధపడుతున్నాయని, హైదరాబాద్ కు ఈ ముప్పు రాకుండా చూస్తామని కేసీఆర్ చెప్పారు. అందమైన మూసీనదిని హైదరాబాద్ కు బహుమతిగా ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని కేసీఆర్ హామీ ఇచ్చారు. హైదరాబాద్ ప్రజలకు శుఖశాంతులతో జీవించే బాధ్యత తనదని కేసీఆర్ అన్నారు. ఈ ఏడేళ్ల కాలంలో కేసీఆర్ సర్కారు పనిచేసిందా, నిద్రపోయిందా చెప్పేందుకే ఈ సభ: కేసీఆర్ తెలంగాణలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఏటా 40 వేల కోట్ల పైచిలుకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని కేసీఆర్ చెప్పారు. వ్యవసాయ రంగంలో ఇప్పటికే తెలంగాణ రెండో స్థానంలోకి తీసుకొచ్చామని, త్వరలోనే ఫస్ట్ ప్లేస్ లోకి తీసుకొస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఏడేళ్ల కాలంలో కేసీఆర్ సర్కారు పనిచేసిందా నిద్రపోతుందా అనేది మీకు తెలియడంకోసమే ఈ సమీక్ష పెట్టినట్టు కేసీఆర్ చెప్పారు. కేసీఆర్ కు కులమత బేధం లేదు.. మేమిచ్చేవి ఎలక్షన్ల తాయిలాలు కావు.. హైదరాబాద్ ప్రజలకు శాశ్వత ప్రయోజనం కలిగించేవి : కేసీఆర్ ప్రతీ అపార్ట్ మెంట్ వాసులకు కూడా 20వేల లీటర్ల వరకూ ఉచిత మంచినీటి సరఫరా కల్పిస్తున్నామని కేసీఆర్ అన్నారు. పల్లె ప్రగతి ద్వారా భారతదేశమే ఆశ్చర్యపడే విధంగా ప్రతీ గ్రామ పంచాయితీలో నర్సరీలు కల్పించి దేశంలోనే కొత్త అధ్యాయాన్ని సృష్టించామని కేసీఆర్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఏ పథకం చేపట్టినా ఎలాంటి బేధాలు, తారతమ్యాలు లేకుండా అమలు చేస్తున్నామని కేసీఆర్ అన్నారు. ఈ కోవలో తీసుకున్నదే కంటివెలుగు పథకమని కేసీఆర్ చెప్పారు. కేసీఆర్ కు కుల మత బేధాలు లేవని ఆయన చెప్పారు. కేసీఆర్ కిట్టు .. సూపర్ హిట్టు పథకమని, రైతుబంధు, రైతు బీమా ఇచ్చే ప్రభుత్వం ఎక్కడైనా ఉందాని సీఎం ప్రశ్నించారు. బస్తీ దవాఖానాలు హైదరాబాద్ నగరంలో ఎప్పుడన్నా కలగన్నామా అని కేసీఆర్ అన్నారు. ఇప్పటివరకూ 350 బస్తీ దావఖానాలు ఏర్పాటు చేశామని సీఎం చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఎవరూ ఊహించని పరిణితిని ప్రదర్శించింది టీఆర్ఎస్ పార్టీ: కేసీఆర్ హైదరాబాద్ లో ఉన్న ప్రతీ బిడ్డా మా బిడ్డేనని టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక భావించి ఆచరించామని దానికి ఈ ఏడేళ్ల పాలనే సాక్షి అని కేసీఆర్ అన్నారు. ఈ విషయం మీ అందరికీ తెలుసునని కేసీఆర్ చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఏదో అయిపోతుందని శాపనార్థాలు, భయాలు పెట్టారని అయితే వాటన్నింటినీ టీఆర్ఎస్ పార్టీ తుడిచిపెట్టిందని కేసీఆర్ చెప్పారు. కరెంట్ కోసం ఎంతో భయాందోళనలు సృష్టించారని అయితే, 24 గంటలు కరెంట్ నిరంతరం సరఫరా ఇచ్చామని ఇది తెలంగాణ మొదటి విజయమని కేసీఆర్ చెప్పారు. పార్టీకి ఓటేసే ముందు పార్టీల పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలి : కేసీఆర్ రాజకీయ పార్టీల నేతలు ప్రజల పట్ల ఏ దృక్పదంతో ఉన్నారన్నది ఓటు వేసే ముందు ఓటర్లు తప్పకుండా ఆలోచన చేయాలని కేసీఆర్ అన్నారు. అలా ప్రజలు ఆలోచించినప్పుడే పనిచేసేవాళ్లు చాలామంది పుట్టుకొస్తారని కేసీఆర్ అన్నారు. సేవచేయడంలో రాజకీయనేతల్లో పోటీతత్వంకూడా పెరుగుతుందని తద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందని కేసీఆర్ అన్నారు. రాజకీయ సందర్భాలు చాలా వస్తుపోతూ ఉంటాయని ఒక పార్టీ, ఒక ప్రభుత్వం, ఒక నాయకుడు ఆలోచనా విధానం, వారి వైఖరి, అభివృద్ధి గురించి ఎలా ఆలోచిస్తున్నారు. భవిష్యత్ కోసం వారు ఆలోచిస్తున్న ప్రణాళికల మీద ప్రజల్లో చర్చ జరగాలని కేసీఆర్ అన్నారు. ఈ సారి తప్పకుండా సెంచరీ కొడతాం : కేకే కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల విజయాలు కొత్త కాదన్నారు టీఆర్ఎస్ ఎంపీ, సెక్రటరీ జనరల్ కే కేశవరావు. ఎల్బీస్టేడియంలో నిర్వహిస్తోన్న సీఎం బహిరంగ సభలో కేకే ప్రసంగించారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 స్థానాలు సాధించి ఒక్కసీటులో సెంచరీ మిస్ అయిందని ఇప్పటి ఎన్నికల్లో మాత్రం తప్పకుండా వందకు పైగా సీట్లు సాధించిన సెంచరీ పూర్తి చేస్తామని కేకే అన్నారు. మనం అభివృద్ధిని కోరుకుంటుంటే, ఇతర పార్టీలు మాత్రం ప్రజల మధ్య ద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నాయని కేకే అన్నారు. జంటనగరాల ప్రజలు టీఆర్ఎస్ వైపు ఉన్నారు : మంత్రి తలసాని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు, ఈ ఐదేళ్ల కాలంలో హైదరాబాద్ నగరానికి ఏం చేశారో చెప్పకుండా టీఆర్ఎస్ పార్టీపై ఆరోపణలు చేయడం వింతగా ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎల్బీస్టేడియంలో నిర్వహిస్తోన్న బహిరంగ సభలో మంత్రి తలసాని ప్రసంగించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, డబుల్ బెడ్ రూం ఇళ్లు సహా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న తరుణంలో హైదరాబాద్ ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి మళ్లీ పట్టం కావాల్సిన అవసరం ఎంతో ఉందని తలసాని కోరారు. ఇంతవరకూ పాలించిన కాంగ్రెస్ పార్టీకూడా హైదరాబాద్ కు చేసింది శూన్యమని తలసాని విమర్శించారు.