రైతుకు కల్తీ విత్తనాలు ఇచ్చినందుకు నష్ట పరిహారం 2.5 లక్షలు చెల్లించాలని తీర్పునిచ్చిన రాష్ట్ర కమిషన్


 

నష్టపోవడం రైతులకు, ముంచెయ్యడం కొన్ని విత్తన కంపెనీలకు అలవాటు అయ్యిపోయింది. అన్నదాతలు ఎన్నిసార్లు ఆవేదన వ్యక్తం చేసినా, ఆందోళనలు చేసినా ఈ సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. కానీ తాజాగా అనంతపురం జిల్లా పామిడి మండలానికి చెందిన లక్ష్మీనారాయణరెడ్డి అనే రైతుకు వినియోగదారుల కమిషన్ న్యాయం చేసింది. వివరాల్లోకి వెళ్తే…మణికంఠ ఆగ్రో ఏజెన్సీస్‌లో రూ.6,880తో పత్తి విత్తనాలను కొని రెండున్నర ఎకరాల్లో సాగు చేశారు లక్ష్మీనారాయణరెడ్డి. పంట ఎంతకీ రాకపోవడంతో వ్యవసాయాధికారులకు సమాచారమిచ్చారు. విత్తనాలిచ్చిన షాపు ఓనర్ వద్దకు వెళ్లి నష్ట పరిహారం ఇప్పించాలని కోరారు. ఆ తర్వాత ఆయనకు, ముంబయికి చెందిన విత్తన తయారీదారు, అనంతపురానికి చెందిన డిస్ట్రిబ్యూటరుకులీగల్‌ నోటీసులిచ్చారు. అయితే వారు అనంతపురం జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. తామిచ్చిన సూచనలను రైతు పాటించనందునే పంట నష్టం వాటిల్లిందని విత్తన తయారీ సంస్థ కౌంటరు వేసింది. 2017లో జిల్లా కమిషన్‌ ఇరు వర్గాల వాదనలను విని విత్తన సంస్థ తరఫున సేవాలోపం ఉందని గుర్తించింది. విత్తన సంస్థ, సరఫరాదారు, డీలరు కలిసి పంట నష్టానికిగానూ రైతుకు రూ.2.5 లక్షలు చెల్లించాలని తీర్పునిచ్చింది. తీర్పును విత్తన సంస్థ సవాల్ చేస్తూ రాష్ట్ర కమిషన్‌ను ఆశ్రయించింది. జిల్లా కమిషన్‌ నిర్ణయాన్నే సమర్థిస్తూ రాష్ట్ర కమిషన్‌ అధ్యక్షుడు జస్టిస్‌ టి.సునీల్‌ చౌదరి, మెంబర్ పి.ముత్యాల నాయుడు తీర్పునిచ్చారు. అయితే అన్నీ ఆధారాలు ఉండబట్టి ఇన్నేళ్ల తర్వాత న్యాయం జరిగింది. అవే లేకపోతే పరిస్థితి వేరే ఉండేది. అసలు తాము మోసపోయామని వినియోగదారులు కమిషన్ ఆశ్రయించే రైతులు ఎంతమంది ఉంటారు చెప్పండి. అందుకే నకిలీ విత్తన సంస్థలపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. అన్నదాతలను మోసం చెయ్యాలంటే వెన్నులో వణుకు పుట్టేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.