30 సెకన్లు లో కరోనా అంతం


 

న్యూఢిల్లీ: ప్రపంచమంతా కరోనాతో తల్లడిల్లిపోతోంది. వ్యాక్సిన్ అభివృద్ధి చేసేందుకు శాస్త్రవేత్తలు రాత్రనకపగలనక శ్రమిస్తున్నారు. ఈ నేపధ్యంలో 'ప్లాజ్మా జెట్' 30 సెకెన్లలో కరోనా వైరస్‌ను చంపుతుందని ఒక పరిశోధనలో తేలింది. శాస్త్రవేత్తలు 3 డి ప్రింటర్ నుంచి రూపొందే ప్రెజర్ ప్లాస్మా జెట్ స్ప్రేను తయారుచేశారు. ఈ ప్రయోగం విజయవంతమయ్యింది. ఇది కరోనా మహమ్మారిని అంతమెందించడంలో కీలకంగా పనిచేయగలదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌లోగల యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో నిర్వహించిన పరిశోధనల్లో ఈ ప్లాజ్మా జెట్... లోహం, తోలు, ప్లాస్టిక్ ఉపరితలాలపై ఉన్న కరోనా వైరస్‌ను 30 సెకన్లలోపు చంపగలదని రుజువయ్యింది. ఈ పరిశోధన కరోనాపై జరుగుతున్న పోరాటంలో అద్భుత విజయంగా శాస్త్రవేత్తలు పరిగణిస్తున్నారు. కరోనా వైరస్‌ను చంపడానికి పరిశోధకులు 3డి ప్రింటర్ ప్రెజర్ ప్లాస్మా జెట్ స్ప్రేను సృష్టించారు. ఈ స్ప్రేను ప్లాస్టిక్, మెటల్, కార్డ్ బోర్డ్, తోలు (బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, బేస్ బాల్) తదితర ఉపరితలాలపై ఉపయోగించినప్పుడు, దాని ఉపరితలాలపై ఉన్న కరోనా వైరస్ మూడు సెకెన్లలో అంతమైనట్లు కనుగొన్నారు. అలాగే మాస్క్‌పై ఈ స్ప్రేను ఉపయోగించినప్పుడు కూడా చక్కని ఫలితాలను వచ్చినట్లు తేలింది. ఫిజిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ పత్రికలో ఈ పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి.