ఏపీలో డిసెంబర్ 30 నాటికి రైతులకు పంట నష్టం

 


నివర్ తుఫాను కారణంగా రాష్ట్రంలో 30 వేల హెక్టార్లలో వ్యవసాయ పంటలు.. 13 వందల హెక్టర్లలో ఉద్యానవన పంటలు నష్టపోయినట్టుగా సమాచారం ఉందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన తుఫాను సహాయక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారని కన్నబాబు వెల్లడించారు. ఎవరైతే నివర్ తుఫాను ప్రభావంతో నిరాశ్రయులై శిబిరాల్లో తలదాచుకుంటున్నారో వాళ్లందరికీ చిన్నా, పెద్దా అనే బేధం లేకుండా రూ. 500 చొప్పున సాయం అందిస్తామని కన్నబాబు వెల్లడించారు. ఇవాళ అమరావతిలో జరిగిన క్యాబినెట్ సమావేశం అనంతరం మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాల్ని మంత్రి కన్నబాబు మీడియాకు వెల్లడించారు. పోలవరం ప్రాజక్టు ఎత్తు తగ్గినట్టు వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలేనని కన్నబాబు స్పష్టం చేశారు. వర్షాలు, వరదల వల్ల నెల్లూరు జిల్లాలో ముగ్గురు చనిపోయినట్టు సమాచారం ఉందని కన్నబాబు తెలిపారు. పంట నష్టపోయిన ప్రాంతాల్లో… 80శాతం సబ్సిడీపై విత్తనాలు సరఫరాచేయాలని క్యాబినెట్ మీటింగ్ లో సీఎం ఆదేశాలిచ్చారు. నివర్ తుఫాను కారణంగా ఆస్తినష్టం, ప్రాణనష్టాలు ఉంటే.. మార్గదర్శకాల ప్రకారం వారికి త్వరగా పరిహారం అందించేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నవరత్నాల హామీలో భాగంగా 30.6 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.. ఇందుకోసం రూ.23 వేల కోట్ల విలువైన 66,518 ఎకరాలను సేకరించినట్టు అధికారులు తెలిపారు. అందులో 25,193 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా, 22,342 ఎకరాలు ప్రైవేటు భూమి ఉందని వెల్లడించారు. ప్రస్తుతం లబ్ధిదారులకి డీ ఫాం పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. 11 వేల పంచాయితీల్లో 17,500 లే అవుట్‌లలో ఇళ్ల స్ధలాలు అందించనున్నారు.