. నలుగురు వ్యోమగాముల్ని అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌కు పంపిన స్పేస్ ఎక్స్

 

హైదరాబాద్‌: అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ .. నలుగురు వ్యోమగాముల్ని అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌కు ఫాల్కన్ 9 రాకెట్‌లో తరలిస్తోంది
. ఫ్లోరిడా నుంచి ఐఎస్ఎస్‌కు స్పేస్ఎక్స్ సంస్థ తన రాకెట్‌ను నింగిలోకి ప్రయోగించింది. డ్రాగన్ క్రూలో వెళ్తున్న వ్యోమగాముల్లో.. ముగ్గురు అమెరికన్లు, ఓ జపాన్ ఆస్ట్రోనాట్ ఉన్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వ్యోమగాముల్ని తరలించడం స్పేస్ఎక్స్ సంస్థకు ఇది రెండవసారి కావడం విశేషం. కమర్షియల్ ప్రొవైడర్ల ద్వారా ఆస్ట్రోనాట్లను స్పేస్ స్టేషన్‌కు పంపడం ఓ కొత్త శకానికి తెరలేపుతుందని స్పేస్ ఏజెన్సీ నాసా పేర్కొన్నది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్తున్న వారిలో అమెరికా ఆస్ట్రోనాట్లు మైఖేల్ హాప్కిన్స్‌, విక్టర్ గ్లోవర్‌, షానన్ వాల్కర్ ఉన్నారు. ఇక జపాన్‌కు చెందిన జాక్సోనాట్ సొచి నగూచి కూడా ఉన్నారు. జపాన్ ఆస్ట్రోనాట్‌ను నగూచి అంతరిక్షంలోకి మూడుసార్లు వెళ్లారు. అయితే ఆయన మూడుసార్లు భిన్న అంతరిక్ష వాహనాల్లో ప్రయాణించారు. ఓసారి రష్యాకు చెందిన సోయేజ్‌, అమెరికా నాసాకు చెందిన షటిల్ సర్వీస్, ఇక ఇప్పుడు స్పేస్ఎక్స్ రాకెట్‌లో అతను ప్రయాణించారు. స్పేస్ స్టేషన్ చేరుకునేందుకు ఒక రోజు సమయం పట్టనున్నది. మంగళవారం జీఎంటీ సమయం 4 గంటలకు డ్రాగన్ క్రూ.. ఐఎస్ఎస్‌తో డాకింగ్ జరగనున్నది. ఇప్పటికే అంతరిక్ష కేంద్రంలో నాసా ఆస్ట్రోనాట్ కేట్ రూబిన్స్‌, రష్యన్ స్పేస్ ఏజెన్సీ కాస్మోనాట్ సెర్గీ రిజికోవ్‌, సెర్గీ కుడ్ స్వెర్చోవ్‌లు ఉన్నారు.