భారత్ కి కృతజ్ఞతలు చెప్పిన నేపాల్ ఆరోగ్య మంత్రి


 

ఖాట్మండు: కరోనా కష్టకాలంలో అండగా నిలిచిన భారత్‌కు నేపాల్‌ ఆరోగ్యమంత్రి భాను భక్త ధాకల్ కృతజ్ఞతలు తెలిపారు. గత విభేదాలను పక్కనబెట్టి మరీ సాయం చేయడం భారత్ ఔదర్యానికి నిదర్శనమని ఆయన కొనియాడారు. సానుకూల దృక్పథంతో పాటు ఇరు దేశాల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించే విధంగా నేపాల్‌కు భారత్ 28 ఐసీయూ వెంటిలేటర్లను విరాళంగా ఇచ్చింది. నేపాల్ ఆరోగ్య శాఖ నిర్వహించిన ఓ కార్యక్రమంలో భారత దౌత్యాధికారి వినయ్ మోహన్ ఖ్వాత్రా వీటిని నేపాల్ ఆరోగ్యమంత్రి భాను భక్తకు అందజేశారు. ఈ సందర్భంగా భారత్‌పై భాను భక్త ప్రశంసలు కురిపించారు. ''ఈ సంక్షోభ సమయంలో నేపాల్‌కు అండగా నిలిచిన భారత్‌కు కృతజ్ఞతలు. గతంలో ఇరు దేశాల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ.. వాటిని పక్కనబెట్టి మరీ కొవిడ్-19పై పోరాడేలా నేపాల్‌కు భారత్ చేయూత అందించింది...'' అని ఆయన పేర్కొన్నారు. భారత్‌తో తమ చెలికి ఎప్పటికీ కొనసాగుతుందని ఆయన పునరుద్ఘాటించారు.