ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ కు సెల్ఫ్ ఐసోలేషన్


 

జెనీవా (స్విట్జర్లాండ్): కరోనా సోకుతుందనే భయంతో సాక్షాత్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ తాజాగా సెల్ఫు ఐసోలేషన్‌లోకి వెళ్లారు. కరోనా వైరస్ సోకిన వ్యక్తితో సంబంధాలున్నందున తాను సెల్ఫు ఐసోలేషన్ లోకి వెళుతున్నట్లు టెడ్రోస్ ఘెబ్రేయేసన్ ప్రకటించారు. '' నేను కొవిడ్-19 పాజిటివ్ వ్యక్తితో కలిసినట్లు గుర్తించాను. నాకు కరోనా లక్షణాలు లేకున్నా ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా సెల్ఫు ఐసోలేషన్‌లోకి వెళ్లి ఇంటి నుంచి పనిచేస్తాను''అని టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ ట్వీట్ చేశారు. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని తగ్గించడానికి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలపై భారాన్ని తొలగించడానికి కరోనా ఆరోగ్య మార్గదర్శకాలు పాటించడం చాలా ముఖ్యమని టెడ్రోస్ నొక్కి చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థలో పనిచేస్తున్న తన సహచరులకు హాని కలిగించకుండా వారి జీవితాలను కాపాడేందుకు తాను సెల్ఫు ఐసోలేషన్ లో ఉండి పనిచేస్తున్నానని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ వివరించారు.