పేద నిరుద్యోగుల కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

 


AP Government: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనార్టీలకు ఆర్ధిక భరోసా కల్పించేందుకు సిద్దమైంది. ఆయా వర్గాలకు చెందిన సుమారు 9,260 మంది పేద నిరుద్యోగులను ఎంపిక చేసి భారీ సబ్సిడీతో మినీ ట్రక్కులను అందజేయనుంది. జనవరి నుంచి ఇంటింటికీ సబ్సిడీ బియ్యం పధకాన్ని అమలు చేసేందుకు జగన్ సర్కార్ సిద్దమైన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ట్రక్కుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ వాహనాల ద్వారా గోడౌన్‌ల నుంచి సరకులను డీలర్ షాపులకు చేర్చనుండగా.. అక్కడ నుంచి ఇంటింటికీ పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే వాహనాల కొనుగోలుకు సంబంధించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మరోవైపు ఒక్కో వాహనం ఖరీదును రూ. 5.81 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో 60 శాతం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. కాగా, మినీ ట్రక్కులకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ శుక్రవారం నుంచి మొదలైంది. ఈ నెల 27వ తేదీవరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఇక డిసెంబర్ 4న ఇంటర్వ్యూలు, 5న లబ్దిదారుల తుది జాబితాను ప్రకటించనున్నారు.