విశాఖ గెస్ట్ హౌస్ పై టగ్ ఆఫ్ వార్

 

విశాఖలో 30 ఎకరాల్లో గెస్ట్ హౌస్

నిర్మించాలని వైసీపీ సర్కార్.. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అడ్డుకోవాలని అమరావతి జేఏసీ న్యాయపోరాటం చేస్తున్నాయి. గత విచారణ సందర్భంగా హైకోర్టు ప్రభుత్వం చేపట్టిన ఈ అతిథిగృహం నిర్మాణంకు సంబంధించిన ప్లాన్, కేటాయించిన నిధుల వివరాలు తమకు ఇవ్వాలని ఆదేశించింది. యథాతథ స్థితికి ఆదేశించింది. అయితే ప్రభుత్వం సమర్పించలేదు. కానీ సుప్రీంకోర్టుకు వెళ్లింది. యథాతథ స్థితిని ఎత్తివేయాలని… గెస్ట్ హౌస్ నిర్మాణానికి అనుమతించాలని కోరింది. సోమవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిగే అవకాశం ఉంది. మరో వైపు గ్రేహౌండ్స్ కేంద్రం ఉన్న చోట గెస్ట్ హౌస్ నిర్మాణం నిబంధనలకు విరుద్ధమని.. అమరావతి జేఏసీ కన్వినర్ మరో పిల్ ను హైకోర్టులో దాఖలు చేశారు. ప్రజాప్రతితినిధులు, ప్రభుత్వం, ప్రజల ఆస్తులకు, ప్రాణాలకు నష్టం వాటిల్లకుండా కాపాడే ప్రత్యేక కమాండోల విభాగం గ్రేహౌండ్స్. అలాంటి చోట గెస్ట్ హౌస్ కడితే వారి భద్రతకు ముప్పు వాటిల్లుతుందని పిటిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు. కమాండోల జీవించే హక్కు ప్రమాదంలో పడుతుందంటున్నారు. అదే సమయంలో ప్రభుత్వంలో మరో ఆలోచన ఉందని.. ప్రస్తుతం 30 ఎకరాలు అని చెబుతున్నప్పటికీ ఆ తర్వాత 300 ఎకరాలు స్వాధీనం చేసుకొని, గ్రేహౌండ్స్ శిక్షణా కార్యక్రమాన్ని ఆనందపురం మండలం జగన్నాధపురం గ్రామంకు తరలించే ఉద్ధేశంతో ప్రభుత్వం ఉందని పిటిషనర్ చెబుతున్నారు. ప్రభుత్వ చర్యల వల్ల ఖజానాకు రూ.వెయ్యి కోట్ల మేర నష్టం వాటిల్లుతుందని అమరావతి జేఏసీ కన్వీనర్ తన పిటిషన్‌లో చెబుతున్నారు. అందుకే ప్రభుత్వం నిర్మించతలపెట్టిన అతిథిగృహం నిర్మాణాన్ని నిలిపివేయాలని అభ్యర్థించారు. ఇందులో ప్రతివాదులుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ను కూడా పేర్కొన్నారు. అటు ప్రభుత్వం.. ఇటు అమరావతి జేఏసీ .. విశాఖ గెస్ట్ హౌస్‌ నిర్మాణంపై న్యాయపోరాటాన్ని ఓ రేంజ్లో చేస్తున్నాయి.