తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలతో బస్తీ మే సవాల్ 

తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలతో బస్తీ మే సవాల్ అన్నారు. రెండు పార్టీల నేతలు తప్పుడు ప్రచారంతో రాజకీయాలు చేస్తున్నారని ఎర్రబెల్లి దయాకర్ విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏం నిధులు తెచ్చారో సాక్ష్యాలతో చూపాలంటూ బీజేపీ నేతలను డిమాండ్ చేశారు. అదే సమయంలో రైతు బంధు వంటి పథకం ఏ రాష్ట్రంలో వుందో చెప్పాలంటూ బీజేపీ, కాంగ్రెస్ నేతలకు బహిరంగ సవాల్ విసిరారు. మరో మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సోమవారం నాడు హన్మకొండలో మీడియాతో మాట్లాడారు. ‘‘ బీజేపీ నేతలు తప్పుడు ప్రచారాలతో తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారు.. బీజేపీ నేతలు తెలంగాణ రాష్ట్రానికి ఏం తెచ్చారో సాక్ష్యాలతో చూపండి.. దుబ్బాకలో తప్పుడు ప్రచారాలు చేసి, ఓ కార్యకర్తను బలిచేసి ప్రజలను మోసం చేసి గెలిచారు.. బీజేపీకి చెందిన నలుగురు ఎంపీలు ఏం చేశారో శ్వేత పత్రం విడుదల చేయండి.. ’’ అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఎర్రబెల్లి. ‘‘ వర్షాలతో రాష్ట్రం అల్లకల్లోలం అయినా పట్టించు కోలేదు.. పేదల సంక్షేమంలో మీ పాత్ర ఏంటి? మిషన్ భగీరథకు కేంద్రం 10 అవార్డులు ఇచ్చి ప్రశంసించారు. కానీ ఒక్క రూపాయి కూడా కేటాయించ లేదు.. హైదరాబాద్ నగరం వరదలకు కొట్టుకుపోతే ఆదుకోవాలనే సోయి లేదు.. బీజేపీ నేతలు ప్రజలను పచ్చి మోసం చేస్తున్నారు.. బీజేపీ – కాంగ్రెస్ పార్టీలకు బహిరంగ సవాల్… దేశంలో ఏ రాష్ట్రంలోనైనా రైతు బంధు ఇస్తున్నారా.. ఇస్తే రుజువు చేయాలి..’’ అంటూ బస్తీ మే సవాల్ చేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.