డొనాల్డ్‌ ట్రంప్‌నకు మద్దతుగా ఆయన మద్దతుదారులు చేపట్టిన నిరసన ర్యాలీ ఉద్రిక్తం.

 

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు మద్దతుగా ఆయన మద్దతుదారులు చేపట్టిన నిరసన ర్యాలీ ఉద్రిక్తంగామారింది.
ఇరువర్గాల ఘర్షణలో పలువురు గాయపడినట్టుగా స్థానిక మీడియా పేర్కొన్నది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమి పాలయ్యారు. ఎన్నికల ఫలితాలకు వ్యతిరేకంగా వేలాది మంది ట్రంప్‌ మద్దతుదారులు వాషింగ్టన్‌లో నిర్వహించిన ర్యాలీ ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పెప్పర్‌ స్ప్రే వాడారు. 'దొంగతనం ఆపాలి' 'మేమే ఛాంపియన్స్' అంటూ ట్రంప్‌ మద్దతుదారులు నినాదాలు చేస్తూ వాషింగ్టన్ దిగువ పట్టణంలోని వైట్ హౌస్ సమీపంలో ఉన్న ఫ్రీడమ్ ప్లాజా వద్ద ర్యాలీ చేసే ప్రదేశంలోకి ప్రవేశించారు. ఎన్నికల్లో మోసం చేశారంటూ వారు ర్యాలీ చేపట్టారు. మరో నాలుగేండ్లు ట్రంప్‌యే అమెరికా అధ్యక్షుడిగా ఉండాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ట్రంప్‌ 2020, కీప్‌ అమెరికా గ్రేట్‌ అంటూ రాసిన జెండాలను చేతబూని నిర్వహించిన ర్యాలీలో ఫ్రౌండ్ బాయ్స్, యాంటీఫా వంటి కన్సర్వేటీవ్ గ్రూప్‌ సభ్యులున్నారు. వీరికి ప్రత్యర్థి వర్గమైన బ్లాక్‌లైవ్స్‌ మ్యాటర్స్‌ బృందం ఎదురుకావడంతో.. ఇరువర్గాలు రెచ్చిపోయి నినాదాలు చేశారు. మేం ఓటేసి బైడెన్‌ను అమెరికా అధ్యక్షుడి ఎన్నుకున్నది ట్రంప్‌కు మరో నాలుగేండ్లు దాసోహం కావడానికి కాదంటూ బైడెన్‌ మద్దతుదారులు వాగ్వాదానికి దిగారు. దాంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొన్నది. ఈ క్రమంలో ఇరువర్గాలు బాహాబాహీకి దిగడంతో పలువురు గాయపడినట్లు సోషల్ మీడియలో వైరల్‌ అయిన వీడియోలో కనిపిస్తున్నది. ఆందోళనల్లో ఇద్దరు పోలీసు అధికారులు కూడా గాయపడ్డారు. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. ర్యాలీ చేస్తున్న వారిని చెదరగొట్టేందుకు పోలీసులు ఓ సమయంలో పెప్పర్‌ స్ప్రే ఉపయోగించాల్సి వచ్చింది. ఈ ఘటనలో దాదాపు 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకరు కత్తిపోట్లకు గురైనట్లుగా సమాచారం. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో జో బైడెన్‌ 306 ఎలక్ట్రోరల్‌ కాలేజీ ఓట్లు దక్కించుకోగా.. డొనాల్డ్‌ ట్రంప్‌కు కేవలం 232 ఓట్లు వచ్చినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ ట్రంప్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.