ఆది పురుస్ కోసం ట్రైనింగ్ తీసు కుంటున్న ప్రభాస్

 


రెబల్ స్టార్ ప్రభాస్ మంచి జోరు మీదున్నాడు. వరుసగా భారీ ప్రాజెక్టులు చేస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్.. రాధే శ్యామ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. రాధా కృష్ణ కుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా పూర్తయిన వెంటనే ప్రభాస్ మరో పాన్ ఇండియా ప్రాజెక్టులో నటించనున్నాడు. ప్రముఖ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న 'ఆదిపురుష్' షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం అవనుంది. ఆదిపురుష్ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కుతుందని, అందులో ప్రభాస్ రాముడి పాత్ర చేస్తున్నాడని బలంగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు మనకు తెలిసిన రాముడిలా కాకుండా ఈ సినిమాలో ప్రభాస్ విభిన్నంగా కనిపిస్తాడని సమాచారం. ఈ సినిమాను 2022 ఆగస్టులో విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ఇక ఆదిపురుష్‌లో తన గెటప్ కోసం ప్రభాస్ చాలా కష్టపడాల్సి ఉందని తెలుస్తోంది. దీనికోసం రెబల్ స్టార్ ఐదు వారాల సమయం కేటాయించాడట. సినిమాలో ప్రభాస్ ఫిజిక్ కొంచెం ఢిఫరెంట్‌గా ఉండబోతోందట. దీని కోసం ప్రభాస్ కాస్త సన్నబడి, కొత్తగా కనిపించాల్సిన అవసరం ఉందని సమాచారం. అందుకే దీనికి ఐదు వారాల సమయం కేటాయించి, ఈ సమయంలో ఎక్కువ టైం జిమ్‌లో గడపుతాడట. అంతే కాదండోయ్ 'బాహుబలి' తర్వాత ప్రభాస్.. ఈ సినిమా కోసం మళ్లీ విల్లును చేత పట్టనున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ విలు విద్య నేర్చుకునేందుకు అత్యుత్తమ నైపుణ్యం ఉన్న ట్రైనర్ దగ్గర శిక్షణ తీసుకోబోతున్నాడు. ఇదిలా ఉంటే రాధే శ్యామ్ షూటింగ్ డిసెంబరు రెండు, మూడు వారాల్లో ముగుస్తుంది. ఆ వెంటనే ప్రభాస్.. ఆదిపురుష్ కోసం సన్నద్దం కానున్నాడు. అంతేకాకుండా ఆదిపురుష్‌తో పాటుగా నాగ్‌ అశ్విన్‌తో చేయనున్న సినిమా కూడా మొదలు అయ్యే అవకాశం ఉంది.