ఎరేవాన్(ఆర్మేనియా): అజర్ బైజాన్లోని నాగోర్నో - కారాబాఖ్ ప్రాంతంపై ఆధిపత్యం కోసం ఘర్షణ పడుతోన్న ఆర్మేనియా, అజర్బైజాన్లు ఘర్షణలకు స్వస్తి పలుకుతూ ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా రష్యా నుంచి 2000 మంది రష్యన్ శాంతి దళాలను వివాదాస్పద ప్రాంతంలో మోహరించాలని తీర్మానించారు. 1994లో కుదిరిన యుద్ధ విరమణ సంధి ప్రకారం నాగోర్నో కారాబాఖ్, ఆర్మేనియా దళాల నియంత్రణలో ఉంది. అంతకు ముందు జరిగిన భీకర పోరాటంలో 30,000 మంది చనిపోయారు. అప్పటి నుంచి, అప్పుడప్పుడు కొన్ని ఘర్షణలు జరిగినప్పటికీ, పూర్తి స్థాయి యుద్ధం ఈ యేడాది సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభం అయ్యింది. అనేక సార్లు కాల్పుల విరమణకు పిలుపునిచ్చి నప్పటికీ అవి అమలు కాలేదు.