నేడు ఐపీఎల్ ఫైనల్. ఫైనల్లో తలపడనున్న ముంబై వర్సెస్ ఢిల్లీ


 

ఐపీఎల్ 2020 సీజన్ చరమాంకానికి చేరుకుంది. దుబాయ్ వేదికగా మంగళవారం రాత్రి 7.30 గంటలకి ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు టైటిల్ కోసం ఫైనల్లో తలపడబోతున్నాయి. లీగ్ దశలో రెండు సార్లు, ప్లేఆఫ్‌లో ఒకసారి ఢిల్లీ క్యాపిటల్స్‌ని అలవోకగా ఓడిచేసిన ముంబయి ఇండియన్స్ టీమ్ ఈ ఫైనల్‌లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. కానీ.. తమని తక్కువ అంచనా వేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని గత ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌ని ఓడించడం ద్వారా ఢిల్లీ క్యాపిటల్స్ నిరూపించింది. 13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ముంబయి టీమ్ ఫైనల్‌కి చేరడం ఇది ఆరోసారికాగా.. ఇప్పటికే నాలుగు సార్లు ఆ టీమ్ టైటిల్‌ని ముద్దాడింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్‌కి చేరడం ఇదే తొలిసారి. ముంబయి జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ మినహా అందరూ మెరుగైన ఫామ్‌లో ఉన్నారు. ఓపెనర్ డికాక్.. ఆ తర్వాత ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా తాజా సీజన్‌లో గెలిపించే ప్రదర్శనని కనబర్చిన వారే. బౌలింగ్‌లోనూ జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ మంచి టచ్‌లో కనిపిస్తుండగా.. స్పిన్నర్ రాహుల్ చాహర్ కూడా మిడిల్ ఓవర్లలో వికెట్లు పడగొడుతున్నాడు. మొత్తంగా.. ఢిల్లీతో పోలిస్తే ముంబయి టీమ్ మంచి సమతూకంతో కనిపిస్తోంది. ఢిల్లీ టీమ్‌లో ప్రయోగాత్మక ఓపెనర్ మార్కస్ స్టాయినిస్, శిఖర్ ధావన్ సూపర్ ఫామ్‌లో ఉండగా.. మిడిలార్డర్ బలహీనత కొనసాగుతోంది. శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ ఇటీవల టచ్ కోల్పోగా.. సిమ్రాన్ హిట్‌మెయర్ గత మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్లని సమర్థంగా ఎదుర్కొని మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఇక స్లాగ్ ఓవర్లలో ఫినిషర్ బాధ్యతని అక్షర్ పటేల్ తీసుకుంటున్నాడు. బౌలింగ్‌లో కగిసో రబాడ, ఆన్రిచ్ నోర్తేజ్ చక్కగా రాణిస్తుండగా.. అశ్విన్, అక్షర్ పటేల్ మిడిల్ ఓవర్లలో పరుగులిస్తున్నా.. వికెట్లు పడగొడుతున్నారు. ఇక బ్యాటింగ్‌లోనే కాకుండా బౌలింగ్‌లోనూ ఇటీవల అదరగొడుతున్న స్టాయినిస్.. మరోసారి చెలరేగాలని ఢిల్లీ ఆశిస్తోంది. ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ ముంబయి, ఢిల్లీ జట్లు 27 సార్లు ఢీకొనగా.. ఇందులో 15 సార్లు ముంబయి ఇండియన్స్‌ని విజయం వరించింది. ఇక మిగిలిన 12 మ్యాచ్‌ల్లోనూ ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపొందగా.. తాజా సీజన్‌లో ముంబయి చేతిలో ఢిల్లీ మూడు సార్లు ఓడిపోయింది. దానికి తోడు ముంబయికి ఇప్పటికే ఐదు సార్లు ఫైనల్లో ఆడిన అనుభవం ఉండగా.. 13 ఏళ్లలో ఢిల్లీ తొలిసారి తుది పోరులో తలపడబోతోంది.