సవాల్ కు ప్రతి సవాలు విసురుతున్న బిజెపి నేతలు టిఆర్ఎస్ నేతలు


 

అధికారంలో ఉన్న పార్టీల ముఖ్యనేతలు సవాల్ చేసుకుంటున్నారు. మీరు నిరూపించాలంటే.. మీరు నిరూపించాలని సవాల్ చేసుకుంటున్నారు. కానీ రికార్డులన్నీ తమ దగ్గరే ఉంటాయని.. నిరూపించదల్చుకుంటే క్షణంలో పని అన్న విషయాన్ని మాత్రం వారు గుర్తు చేసుకోవడం లేదు. ఆరోపణలు.. సవాళ్లతో రాజకీయమే చేసుకుంటున్నారు. వారే తెలంగాణ సీఎం కేసీఆర్… తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ఉదయం రైతు వేదికను ప్రారంభించిన సీఎం కేసీఆర్ … దుబ్బాక ఎన్నికలపై స్పందించారు. బీజేపీ అబద్దాలు ప్రచారం చేస్తోందని.. కేంద్రం నిధుల విషయంలో… ఆయన వ్యాఖ్యానించారు. అంతే కాదు.. కేంద్రం రూ. రెండు వందలు మాత్రమే పెన్షన్ ఇస్తోందని.. కానీ తెలంగాణ సర్కార్ రూ. 2016 ఇస్తోందన్నారు. కాదని నిరూపిస్తే తక్షణమే రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. ఆ వెంటనే… సీఎం కేసీఆర్‌ సవాల్‌కు బండి సంజయ్‌ ప్రతిసవాల్‌ విసిరారు. కేంద్రం నిధులు ఇవ్వలేదని నిరూపిస్తే దుబ్బాక చౌరస్తాలో ఉరేసుకుంటానన్నారు. వీరి సవాళ్లు రాజకీయంగా వేడి పెంచుతున్నాయి. తెలంగాణ సర్కార్ అమలు చేస్తున్న పథకాల్లో అత్యధికం కేంద్ర నిధులు ఉంటే.. ఆ లెక్కలను బయట పెట్టడం పెద్ద విషయం కాదు. కేంద్రంలో తమ పార్టీనే అధికారంలో ఉంది కాబట్టి… కావాల్సినంత సపోర్ట్ ఉంటుంది. ఇలా రిపోర్టులు తెచ్చి.. ప్రజల ముందు పెట్టి అలా కేసీఆర్ రాజీనామా కోరొచ్చు. కానీ బండి సంజయ్… కేంద్ర నిధులు రాలేదని నిరూపిస్తే తాను ఉరేసుకుంటానని రాజకీయం ప్రారంభిచారు. ఇక్కడ టీఆర్ఎస్ వైపు కూడా రాజకీయం నడుస్తోంది. కేంద్ర నిధులు రాలేదని.. రికార్డులను చూపించి చెప్పడానికి మొహమాటపడుతోంది. దీంతో ఈ రెండు పార్టీల రాజకీయం… జోరుగా సాగుతోంది. అసలు పథకాలకు కేంద్రం ఎంత ఇస్తోంది.. తెలంగాణ సర్కార్ ఎంత పెట్టుకుంటోంది అన్నది సస్పెన్స్ గానే ఉండిపోతోంది. ఎవరి పార్టీల అభిమానులు వారి వారి పార్టీలకు అనుకూలంగా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. కానీ నిజమేంటో మాత్రం ఇద్దరూ బయటపెట్టడం లేదు. అదే రాజకీయం అనే అభిప్రాయం మాత్రం అంతటా వినిపిస్తోంది.