ఇరాన్‌లో ని ప్రధాన అణు కేంద్రం నటాంజ్‌పై దాడి చేయాలని ప్లాన్


: ఇరాన్‌లో ఉన్న ప్రధాన అణు కేంద్రం నటాంజ్‌పై దాడి చేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. కానీ ఆయన సలహాదారులు ఇచ్చిన సూచన మేరకు.. ఆ అటాక్ వ్యూహాన్ని ట్రంప్ ఉపసంహరించినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. ఇరాన్ అణ్వాయుధ కేంద్రంపై గత వారం దాడి చేయాలని ట్రంప్ నిర్ణయించినట్లు తెలిసింది. ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌, రక్షణ మంత్రి క్రిస్టోఫర్ మిల్లర్‌, జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ మార్క్ మిల్లేతో కలిసి సమావేశం నిర్వహించిన తర్వాత.. ట్రంప్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. సమస్య మరింత జఠిలం అవుతుందని సలహాదారులు హెచ్చరించడంతో.. దాడి ప్రణాళికను ట్రంప్ ఉపసంహరించారు. దీనిపై కామెంట్ చేసేందుకు వైట్‌హౌజ్ నిరాకరించింది. ఇరాన్‌తో ఉన్న విదేశీ విధానం పట్ల గత నాలుగేళ్లలో అధ్యక్షుడు ట్రంప్ దూకుడుగానే వ్యవహరించారు. ఆ దేశంతో న్యూక్లియర్ డీల్ నుంచి ట్రంప్ తప్పుకున్నారు. ఇరాన్‌పై అనేక వాణిజ్య ఆంక్షలను అమలు చేశారు. అయితే యురేనియం ఎన్‌రిచ్‌మెంట్ సైట్ నుంచి అండర్‌గ్రౌండ్ సైట్‌లోకి అడ్వాన్స్‌డ్ సెంట్రిప్యూజ్‌లను తీసుకువెళ్లేందుకు ఇరాన్ అణు కేంద్రం సిద్ధమైనట్లు యూఎన్ అటామిక్ వాచ్‌డాగ్ రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో.. ఆ కేంద్రంపై దాడి చేయాలని ట్రంప్ భావించారు. కానీ సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఆ నిర్ణయాన్ని ట్రంప్ వెనక్కి తీసుకున్నారు. ఇరాన్ వద్ద ప్రస్తుతం 2.4 టన్నుల శుద్దీకరించిన యురేనియం ఉన్నది. ఇది ఒప్పందం కన్నా చాలా ఎక్కువ మోతాదు. డీల్ ప్రకారం ఆ దేశం దగ్గర 202.8 కేజీలు మాత్రమే ఉండాలి.గత క్వార్టర్‌లో ఆ దేశంలో 337.5 కేజీల యురేనియం ఉత్పత్తి చేసింది. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ప్రకారం గత క్వార్టర్లతో పోలిస్తే ఈ ఉత్పత్తి తక్కువే. ఒకవేళ నటాంజ్ న్యూక్లియర్ సైట్‌పై దాడి చేస్తే, అప్పుడు విదేశీ విధానం సమస్యగా మారుతుందని భావించి ట్రంప్ దాడి ప్లాన్‌ను తప్పించినట్లు తెలుస్తోంది. గత జనవరిలో అమెరికా డ్రోన్లు.. ఇరాన్ మిలిటరీ జనరల్ క్వాసిమ్ సోలేమానిని బాగ్దాద్ విమానాశ్రయంలో చంపిన విషయం తెలిసిందే.