అమెరికా అధ్యక్షుడు ఎవరు మొదలైన కౌంట్ డౌన్


 

కౌన్‌బనేగా వైట్‌హౌస్‌ కా బాద్‌షా - ఇండో అమెరికన్లు ఉన్న ఆ 8రాష్ట్రాలే కీలకం - స్వింగ్‌ స్టేట్స్‌ ఎవరికి ఓటేస్తే..వారికే అమెరికా అధ్యక్ష పదవి - మరికొద్ది గంటల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు మిగతా దేశాలతో పోల్చితే అమెరికా ఎన్నికల విధానం, ఫలితాలు సంక్లిష్టమైనవి. ఎవరు ఓడుతారో, ఎవరు గెలుస్తారో అంచనావేయటం అంత సులభం కాదు. గత అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్‌ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ కు ట్రంప్‌ కన్నా కొన్ని లక్షల పాపులర్‌ ఓట్లు ఎక్కువ వచ్చాయి. కానీ ఎలక్టోరల్‌ కాలేజీలో మెజార్టీ పొంది...ట్రంప్‌ అధ్యక్ష పదవి కైవసం చేసుకున్నాడు. ఎలక్టోరల్‌ కాలేజీలో మొత్తం ఓట్లు 538. మ్యాజిక్‌ ఫిగర్‌ 270. గెలుపును ఖరారుచేసే 'స్వింగ్‌ స్టేట్స్‌'లో ఎలక్టోరల్‌ ఓట్లు 127 ఉన్నాయి. ఈ స్వింగ్‌ స్టేట్స్‌లో ఎవరు అధిక ఓట్లు దక్కించుకుంటారో వారే శ్వేతసౌధానికి అధిపతి అవుతారు. వాషింగ్టన్‌ : ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిరేకెత్తిస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌కు కౌంట్‌డౌన్‌ షురూ అయ్యింది. ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, డెమొక్రాట్‌ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌కు మధ్య పోటీ రసవత్తరంగా మారింది. ట్రంప్‌ వైఖరి, ఆయన నిర్ణయాలు, విధానాలు ఇంటాబయటా వివాదాస్పదమయ్యాయి. ప్రజలు మార్పును కోరుకుంటున్నట్టు పలు సర్వేలు పేర్కొంటున్నాయి. ట్రంప్‌ కరోనాను అరికట్టటంలో నిర్లక్ష్యం వహించటం, ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి నిర్ణయాత్మక నిర్ణయం చేయకపోవటం, లాక్‌డౌన్‌ ప్రకటించిన రాష్ట్రాలపై వేధింపులు, తనకు కరోనా సోకినా నిర్లక్ష్యంగా వ్యవహరించటం, ఆయన నిర్వహించిన ర్యాలీలలో ఏ ఒక్కరూ మాస్కులు ధరించకుండా పాల్గొనటం, ట్రంప్‌పై వ్యతిరేకత పెరగటానికి కారణమైంది. అదే సమయంలో బైడెన్‌ మాస్కు ధరించటం, ఆయన ర్యాలీలలో వాహనాల్లోనే ఉండి ప్రజలు భౌతికదూరం పాటించటం స్పష్టంగా కనపడింది. అమెరికాలో ముందస్తు ఓటింగ్‌ మెయిల్‌ ద్వారా వేసే అవకాశాన్ని వినియోగించుకొని 9 కోట్ల మంది ఇప్పటికే ఓట్లువేశారు. ట్రంప్‌ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఓట్లలో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి బైడెన్‌ పది పాయింట్ల ఆధిక్యతతో ఉన్నట్టు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ మరో పత్రిక చేసిన సర్వేలో వెల్లడైంది. 'నల్లజాతి ప్రజలు మనుషులే' అన్న నినాదాన్ని ఇచ్చిన వారు, ఆఫ్రికా అమెరికన్లు తదితరుల నుంచి బైడెన్‌కు మంచి మద్దతు లభిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. అమెరికా జనాభాలో 1 శాతమున్న భారతీయ అమెరికన్లు ఎటువైపు నిలబడ్డా..ఫలితాల్లో పెద్దగా మార్పు ఉండదనీ, కాకపోతే ఆ 8 రాష్ట్రాల్లో (స్వింగ్‌ స్టేట్స్‌) గెలుపు ఓటములను మాత్రం భారతీయ అమెరికన్లు ప్రభావితం చేస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అరిజోనా, ఫ్లోరిడా, జార్జియా, మిచిగాన్‌, మిన్నెసోటా, ఉత్తర కరోలీనా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్‌ రాష్ట్రాల్లో భారతీయ అమెరికన్లు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. ఈ రాష్ట్రాల్లో ఎలక్టోరల్‌ కాలేజ్‌లో భారతీయ అమెరికన్ల ఓట్లు 24శాతమున్నాయి. 2016 అధ్యక్ష ఎన్నికల గణాంకాల్ని పరిశీలిస్తే, ఎన్నికల బరిలో నిలబడ్డ అభ్యర్థి పాపులర్‌ ఓట్లను మాత్రమే పొందితే విజయం లభించలేదు. మ్యాజిక్‌ ఫిగర్‌ అయిన...270 ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లను అభ్యర్థి పొందాలి. ఎన్నికల విశ్లేషకుల లెక్క ప్రకారం, ఈ 8 రాష్ట్రాల్లో ప్రతి ఓటూ కీలకమే. ప్రతి ఓటూ విజయాన్ని ఖరారుచేస్తుంది. 2016లో 4 స్వింగ్‌ రాష్ట్రాల్లో ట్రంప్‌నకు చాలా చాలా స్వల్ప మెజార్టీ దక్కింది. దాంతో ఆయన అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు.