పెద్ద నోట్ల రద్దయి సరిగ్గా నాలుగు సంవత్సరాలు


 

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజుకు సరిగ్గా నాలుగేళ్ల క్రితం అంటే 2016, నవంబరు 8న రాత్రి 8 గంటలకు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశం యవత్తూ ఈ ప్రసంగాన్ని ఎంతో ఆసక్తిగా విన్నది. ఆ ప్రసంగంలో మోదీ రూ. 500, రూ. 1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనతో అప్పటి వరకూ మార్కెట్‌లో ఉన్న 86 శాతం కరెన్సీ చిత్తు కాగితాలుగా మారిపోయింది. ఆ తరువాత ప్రజల అవసరాలను తీర్చేందుకు రిజర్వు బ్యాంకు నెమ్మనెమ్మదిగా కొత్త నోట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నేపధ్యంలో ప్రజలు తమ వద్దనున్న పాతనోట్లను బ్యాంకుల్లో జమ చేసేందుకు పడరాని పాట్లు పడ్డారు. అదేవిధంగా ఏటీఎంల నుంచి కొత్త నోట్లు తీసుకునేందుకు పడిన అవస్థలు అన్నీఇన్నీకాదు. ఇటువంటి ఘటనల్లో వంద మందికిపైగా మృతిచెందారు. నల్లధనాన్ని అరికట్టేందుకే పెద్దనోట్లను రద్దు చేసినట్లు ప్రభుత్వం ఆనాడు ప్రకటించింది. అయితే భారతీయ రిజర్వ్ బ్యాంకు తెలిపిన వివరాల ప్రకారం 99 శాతం కరెన్సీ బ్యాంకులలో జమ అయ్యింది. కొందరు పాత కరెన్సీని ఆస్తుల రూపంలోకి మార్చుకున్నారని తెలియవచ్చింది. తరువాతి కాలంలో నోట్ల కొరత ఏర్పడి జనం పలు ఇబ్బందులు పడ్డారు. మొదట్లో రెండు వేల రూపాయల నోటు మాత్రమే మార్కెట్‌లో చలామణీలోకి వచ్చింది. ఇదే సమయంలో రెండు వేల రూపాయల దొంగనోట్లు కూడా మార్కెట్‌లోకి ప్రవేశించాయి. దీంతో గత ఏడాది ప్రభుత్వం రెండు వేల రూపాయల నోటు ముద్రణను నిలిపివేసింది. పెద్ద నోట్ల రద్దు దేశ జీడీపీపై ప్రభావం చూపింది. ఆర్ధికవృద్ధి తగ్గుముఖం పట్టి 5 శాతానికి స్థిరపడింది. కొన్ని రోజుల పాటు వ్యాపారాలన్నీ మందగించాయి. ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తోంది. అయితే ఇంతలోనే వచ్చిన కరోనా మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థను మరింత దిగజార్చింది.