కె.ఎల్.రాహుల్ కు ఏకలవ్య అవార్డు


 

భారత్ కు ఎంతో మంది మంచి ఆటగాళ్లను కర్ణాటక రాష్ట్రం అందిస్తూ వస్తోంది. గత చరిత్ర ఎంతో ఘనం.. ప్రస్తుతం కూడా అందుకు ఏ మాత్రం తగ్గని రీతిలో ఆటగాళ్లను అందిస్తోంది కర్ణాటక రాష్ట్రం. ఇంకా మరెందరో ట్యాలెంట్ ఉన్న ఆటగాళ్లు పలు టోర్నీలలో మెరుస్తూ కనబడుతూ ఉన్నారు. వాళ్లు కూడా త్వరలో భారత జట్టులో స్థానం సంపాదించే అవకాశాలు ఉన్నాయని చెబుతూ ఉన్నారు. భారత క్రికెట్ జట్టులో కీలక ఆటగాడిలా ఉన్న కేఎల్ రాహుల్ కూడా కర్ణాటకకు చెందిన వాడే..! ఇటీవలే భారత క్రికెట్ జట్టుకు పరిమిత ఓవర్ల క్రికెట్ లో వైస్ కెప్టెన్ గా నియమితుడయ్యాడు. తాజాగా కేఎల్ రాహుల్ కు 'ఏకలవ్య' అవార్డు వరించింది. కర్ణాటక ప్రభుత్వం క్రీడల్లో ప్రదానం చేసే అత్యుత్తమ పురస్కారంగా 'ఏకలవ్య' గురించి చెబుతూ ఉంటారు. గత కొన్నేళ్లుగా అద్భుతమైన ఆటతీరుతో అంతర్జాతీయ క్రికెట్లో రాణిస్తున్న కేఎల్ రాహుల్ ను 'ఏకలవ్య' అవార్డుకు ఎంపిక చేసినట్టు కర్ణాటక ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ విషయాన్ని కేఎల్ రాహుల్ నిర్ధారించాడు. రాష్ట్ర అత్యున్నత పురస్కారం అందిస్తున్నందుకు కర్ణాటక ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాడు. తాను ఈ స్థాయికి వచ్చానంటే అందుకు తన కోచ్ లు, జట్టు సభ్యులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల సహకారమే కారణమని, వారు లేకుండా తన అభ్యున్నతి సాధ్యమయ్యేది కాదని అన్నాడు. ఈ ఏడాది కూడా ఐపీఎల్ లో లోకేష్ రాహుల్ అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఆరెంజ్ క్యాప్ లీగ్ మ్యాచ్ లు ముగిసే వరకూ అతడి దగ్గరే ఉంది. 14 మ్యాచ్ లు ఆడిన రాహుల్ 670 పరుగులు చేశాడు. అందులో 5 హాఫ్ సెంచరీలు, ఒక భారీ సెంచరీ ఉంది. కానీ అతడు కెప్టెన్ గా ఉన్న కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు ప్లే ఆఫ్స్ కు చేరుకోలేకపోయింది