కరోనా కు మరో వ్యాక్సిన్ రెడీ


 

ప్రపంచం మొత్తానికి ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ ( Corona second wave ) భయం పట్టుకుంది. వ్యాక్సిన్ కోసం నిరీక్షిస్తున్న తరుణంలో వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ (Washington school of medicine ) ఓ శుభవార్త అందిస్తోంది. కరోనా వైరస్ నియంత్రణకు అద్భుతంగా పనిచేస్తుందని స్పష్టం చేస్తోంది. కరోనా వైరస్ ( Corona virus ) భయం ఇంకా వెంటాడుతోంది. వ్యాక్సిన్ ( Corona vaccine ) ప్రయోగాలు ఇంకా కొనసాగుతున్నాయి. రష్యా, చైనాలు ఇప్పటికే వ్యాక్సిన్ సిద్ధం చేశామని ప్రకటించినా..ఇంకా అందుబాటులో రాకపోవడంతో ...ఆందోళన ఎక్కువవుతోంది. దీనికి కారణం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కరోనా వైరస్ సెకండ్ వేవ్ భయం పట్టుకోవడమే. ఇప్పటికే యూరోపియన్ దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైనట్టు ఆ దేశాలే ధృవీకరించాయి. యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన పరిశోధకులు అద్భుతమైన శుభవార్తను అందిస్తున్నారు. అతి సూక్ష్మ కణాలతో రూపొందించిన కరోనా వ్యాక్సిన్‌ను ముందుగా ఎలుకలపై ప్రయోగించారు. ఈ ప్రయోగాల్లో అద్భుత ఫలితాలొచ్చాయని వాషింగ్టన్ స్కూల్ పరిశోధకులు చెబుతున్నారు. కరోనా వైరస్‌ బారిన పడి కోలుకున్నవారిలో కంటే తాము వ్యాక్సిన్‌ను ప్రయోగించిన ఎలుకల్లో దాదాపు పది రెట్ల రోగ నిరోధక శక్తి పెరగడం గుర్తించామని చెప్పారు. అంతేకాకుండా..వైరస్‌ను గుర్తించే జ్ఞాపక శక్తి సెల్స్‌ అభివృద్ధి చెందడం కూడా గమనించామంటున్నారు. ఈ వ్యాక్సిన్ ( Vaccine ) కు మరో ప్రత్యేకత ఉందని స్పష్టం చేశారు. వివిధ కంపెనీలు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ తరహాలో కూలింగ్ టెంపరేచర్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఈ ప్రయోజనం ఉన్న కారణంగా ప్రపంచంలో ఏ మూలకైనా ఎటువంటి వాతావరణంలోనైనా వ్యాక్సిన్ తరలించవచ్చంటున్నారు. వాస్తవంగా ఇవ్వాల్సిన వ్యాక్సిన్‌ డోసులో ఐదోవంతు డోసునే ఎలుకల్లో ప్రయోగించి విజయం సాధించామని యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్‌ నీల్‌కింగ్‌ తెలిపారు. ఈ ప్రయోగంలో శరీరంలోని రోగ నిరోధక శక్తికి సంబంధించిన బి సెల్స్‌లో కూడా అభివృద్ధి కనిపించడం కీలకమైన అంశమన్నారు. ఈ విషయాన్ని సెల్ జర్నల్ ( Cell Journal ) వ్యాసంలో ప్రస్తావించారు. ఇక మిగిలింది మనుష్యులపై ప్రయోగాలు మాత్రమేనని...ఏడాది చివరికి అవి కూడా పూర్తి చేస్తామంటున్నారు. అనంతరం వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభమవుతుందని..ఉత్పత్తి కోసం రెండు బయోటెక్ కంపెనీలు పరిశీలనలో ఉన్నాయన్నారు.