రోహిత్ ఆస్ట్రేలియాకు వెళ్లారు పోవడానికి కారణం

 


ముంబై: స్టార్ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఫిట్‌నెస్‌పై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సరైన స్పష్టత ఇవ్వకపోవడంపై తాజాగా టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బోర్డు స్పందించింది. తండ్రికి అనారోగ్యంగా ఉండడం వల్లే రోహిత్‌.. ఆస్ట్రేలియా వెళ్లలేకపోయాడని బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టం చేశాడు. గాయంపై అంచనా వేయడానికి వచ్చే నెల 11న రోహిత్‌కు మళ్లీ ఫిట్‌నెస్‌ పరీక్ష నిర్వహిస్తామని అతను తెలిపాడు. రోహిత్‌ విషయంలో వరుస వివాదాలు, కోహ్లీ వ్యాఖ్యల నేపథ్యంలో బోర్డు బోర్డు ఇచ్చిన వివరణ ఆసక్తకరంగా మారింది. 'యూఏఈలో ఐపీఎల్‌ 2020 ముగిసిన తర్వాత అనారోగ్యంతో ఉన్న తండ్రిని చూసేందుకు రోహిత్‌ శర్మ ముంబై చేరుకున్నాడు. తండ్రి పరిస్థితి మెరుగవుతుండడంతో బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీకి పునరావాసం కోసం వచ్చాడు. రోహిత్‌కు డిసెంబర్‌ 11న మళ్లీ ఫిట్‌నెస్‌ పరీక్ష నిర్వహిస్తాం. పేసర్‌ ఇషాంత్‌ శర్మ పక్కటెముకల గాయం నుంచి కోలుకున్నాడు. కానీ మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధించడానికి అతనికింకా సమయం పడుతుంది. అందుకే ఆసీస్‌తో టెస్టు సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యాడు' అని బీసీసీఐ కార్యదర్శి జై షా పేర్కొన్నాడు. రోహిత్‌ శర్మ విషయంలో ఇంత గందరగోళం నెలకొనడానికి బీసీసీఐ క్రికెట్‌ ఆపరేషన్స్‌ టీమ్‌ కారణమని తెలుస్తోంది. ఈ విభాగం రోహిత్‌ గురించి సరైన సమాచారాన్ని బోర్డుతో పాటు కెప్టెన్‌ విరాట్ కోహ్లీకి కూడా చేరవేయలేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఏదేమైనా.. రోహిత్‌ ఫిట్‌గా తేలితే అతడికి ఆసీ్‌సలో 14 రోజుల క్వారంటైన్‌ నుంచి మినహాయింపు ఇవ్వాల్సిందిగా క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ)ను బీసీసీఐ చీఫ్‌ సౌరవ్ గంగూలీ విజ్ఞప్తి చేసే అవకాశముంది. మరోవైపు ఐపీఎల్ 2020లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టు తరఫున రాణించిన పేస్‌ బౌలర్‌ టీ నటరాజన్‌ను వన్డే జట్టులోకి ఎంపిక చేశారు. ప్రస్తుతం జట్టుతో పాటు ఉన్న నవ్‌దీప్‌ సైనీ వెన్నునొప్పిగా ఉందని చెప్పడంతో బ్యాక్‌పగా నటరాజన్‌కు స్థానం కల్పించినట్టు బీసీసీఐ తెలిపింది. అయితే శుక్రవారం జరిగిన తొలి వన్డేలో సైనీ ఆడాడు. ప్రస్తుతం అతడు మంచి ఫిట్‌నెస్‌తో ఉన్నాడు.