సగం కూడా నిండని ఆర్టీసీ బస్సులు


 

ప్రపంచవ్యాప్తంగా కరోనా వికృత రూపంతో అన్నిరంగాలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. జనం బహిరంగ ప్రదేశాల్లో తిరగకూడదన్న ప్రభుత్వ నిబంధనలతో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ఇప్పటికీ కరోనా భయం తగ్గకపోవడంతో జనం బయటకు రావడానికే జంకుతున్నారు. అయితే, కుదించుకుపోయిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం ఆన్ లాక్ ప్రక్రియను ప్రారంభించింది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజా రవాణాకు అనుమతినిచ్చింది. ఇందులో భాగంగా సుదీర్ఘ విరామం తరవాత తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. కానీ, కరోనా తీవ్రత ఏమాత్రం తగ్గకపోవడంతో జనం బస్సుల్లో ప్రయాణించేందుకు వెనుకడుగువేస్తున్నారు. దీంతో ఆర్టీసీ బస్సుల ఆక్యుపెన్సీ సగానికి పైగా తగ్గుతోందని ఆర్టీసీ ఆధికారులు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య బస్సుల పునరుద్దరణకు సోమవారం అంతర్‌రాష్ట్ర ఒప్పందం కుదిరింది. దీంతో ఆరోజు రాత్రి నుంచి బస్సు సర్వీసులను ప్రారంభించాయి రెండు రాష్ట్రాల ఆర్టీసీ. అయితే, తొలిరోజున ప్రయాణికుల సంఖ్య కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ ఆ తరవాత నుంచి పుంజుకుంటోందని అధికారులు భావిస్తున్నారు. ప్రయాణికుల డిమాండ్‌ మేరకు బస్సుల సంఖ్య పెంచాలని తెలంగాణ ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. కరోనాకు ముందు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు ప్రతిరోజూ సుమారు 750 వరకు బస్సులు నడిచేవి. ప్రస్తుతం 350 బస్సులను మాత్రమే టీఎస్‌ఆర్టీసీ నడుపుతోంది. వాటిల్లో 55 శాతం మాత్రమే ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి సుమారు మూడు వందల బస్సుల వరకు వస్తున్నాయి. వాటిల్లోనూ ప్రయాణికుల సంఖ్య కాస్తంత అటూఇటుగానే ఉన్నట్లు సమాచారం. దీంతో ఒక్కో బస్సుల్లో సగం కూడా లేకపోవడంతో బస్సు ఆక్యుపెన్సీపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. అయితే, ప్రయాణికుల సంఖ్య పెరగడానికి మరికొంత సమయం పట్టే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.