దుబ్బాకలో


 

దుబ్బాక బైపోల్ లో ఎలాగైనా గెలిచి తీరాలన్న కసిలో ఉన్న రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బులను ఎరగా వేస్తున్నాయి. బైపోల్‌లో ఇప్పుడు.. క్యాష్ డ్రామా నడుస్తోంది. ఆదివారం హైదరాబాద్‌లో కోటి రూపాయల డబ్బులు పట్టుబడటం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ప్రచార పర్వం నిన్న(ఆదివారం) సాయంత్రంతో ముగియడంతో ప్రలోభాలపై దృష్టి పెట్టారు నాయకులు. దుబ్బాకలో డబ్బులాట.. బైపోల్‌ను రసవత్తరంగా మారుస్తోంది. దుబ్బాక ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిందే తరువాయి పలుచోట్ల నోట్ల కట్టలు బయటపడ్డాయ్‌. సికింద్రాబాద్‌ మహాంకాళీ పీఎస్‌ పరిధిలో రూ.16.69 లక్షలు దొరికాయ్‌. నారాయణగూడ పీఎస్‌ పరిధిలో రూ.14.90 లక్షలు, సుల్తాన్‌బజార్‌ పీఎస్‌ పరిధిలో రూ.31.26 లక్షలు, సైఫాబాద్‌లో రూ. 50లక్షలు దొరికాయి. ఇక ఆఫ్జల్‌గంజ్‌లో రూ.21.56 లక్షలు, బేగంపేటలో కోటిరూపాయల నగదు పట్టుకున్నారు. హైదరాబాద్‌ వెస్ట్‌జోన్‌ పరిధిలో 48 లక్షలు , శామీర్‌పేటలో 48లక్షలు, నార్సింగ్‌లో 12లక్షలు పట్టుబడ్డాయి. బోయిన్‌పల్లిలో 9 లక్షలు, సిద్దిపేటలో 18 లక్షలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుబ్బాకలో ఓటర్లను ప్రలోభ పరిచేందుకు పార్టీలు డబ్బును తరలిస్తుండగా పట్టుకున్నామని పోలీసులు తెలిపారు.