సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న వకీల్ సాబ్'?


 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం 'వకీల్ సాబ్'. హిందీలో విజయవంతమైన `పింక్` సినిమాకు ఇది రీమేక్‌గా తెరకెక్కుతోంది. వేణు శ్రీరామ్ దర్శకుడు. బోనీ కపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పవన్ సరసన శ్రుతిహాసన్‌ మూడోసారి హీరోయిన్‌గా నటిస్తోంది. లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడిన ఈ సినమా షూటింగ్‌ ఇటీవలే తిరిగి పున:ప్రారంభమైంది. పవన్ కూడా 'వకీల్ సాబ్‌' టీమ్‌తో జతకలిశారు. ఈ షూటింగును వీలైనంత త్వరగా పూర్తిచేసి సంక్రాంతికి విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేసుకున్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యపడేలా కనిపించడం లేదు. సంక్రాంతికి ఇంకా రెండు నెలల సమయమే ఉంది. 'వకీల్ సాబ్' షూటింగ్ పార్ట్ ఇంకా పూర్తికాకపోవడం, ఆ తర్వాత చేపట్టే నిర్మాణాంతర కార్యక్రమాలకు ఆ సమయం సరిపోదని యూనిట్ భావిస్తోందట. చాలా గ్యాప్ తర్వాత పవన్ నటిస్తున్న సినిమాను హడావుడిగా రిలీజ్ చేసేస్తే సీన్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారట. ఇప్పటికే హిందీ, తమిళంలో సూపర్‌హిట్ నిలిచిన ఈ సినిమా తెలుగులోనూ ఘన విజయం సాధించేలా దర్శక నిర్మాతలు తీర్చిదిద్దుతున్నారు. ఈ పరిస్థితుల్లో పవన్‌కు కూడా ఓ భారీ విజయం కావాలి. దీంతో తొందర పడకుండా నెమ్మదిగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని వేసవి బరిలో దిగాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సమాచారం ప్రకారం 'వకీల్ సాబ్' సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నట్లేనని సమాచారం. ఇదే గనుక నిజమైతే పవన్ ఫ్యాన్‌కు చేదు వార్తేనని చెప్పొచ్చు.