ఐదోసారి ఛాంపియన్గా నిలిచిన. ఢిల్లీపై విజయం


 

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో ముంబై ఇండియన్స్‌ అప్రతిహత జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. ఐపీఎల్ 2020లో ప్రత్యర్థి ఎవరైనా నిర్దాక్షిణ్యమైన ఆటతీరును కనబర్చిన ఈ జట్టు తుదికంటా అదే జోరును కొనసాగించింది. ఇప్పటి వరకు నాలుగు టైటిల్స్‌తో శిఖరాన నిలబడిన రోహిత్‌ సేన ఏకంగా ఐదోసారి చాంపియన్‌గా నిలిచి తమ ఘనతను మరింత పదిలం చేసుకుంది. దుబాయ్ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన ఫైనల్లో ముంబై 5 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. రోహిత్‌ శర్మ సారథ్యంలోనే ముంబై ఐదు టైటిల్స్ గెలవడంతో.. అతడు హీరో అయ్యాడు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సూపర్‌ ఇన్నింగ్స్‌తో ముంబై ఇండియన్స్‌కు ఐదో టైటిల్ అందించి హీరో అయినా.. ఆ జట్టు స్టార్ బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్ యాదవ్ మాత్రం అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. తమ కెప్టెన్ వికెట్ కాపాడటం కోసం సూర్యకుమార్ తన వికెట్‌ను త్యాగం సూపర్ హీరో అయ్యాడు. విషయంలోకి వెళితే... 157 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ (68; 51 బంతుల్లో 5×4, 4×6), క్వింటన్ డికాక్ (12 బంతుల్లో 20) మంచి శుభారంభం ఇచ్చారు. ఇద్దరూ స్వేచ్ఛగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. డికాక్‌ను మార్కస్ స్టోయినిస్ పెవిలియన్ చేర్చినా.. రోహిత్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఈ సీజన్లో పరుగులు చేయడానికి ఇబ్బంది పడిన రోహిత్ శర్మ.. ఫైనల్లో మాత్రం అద్బుతంగా ఆడుతూ హాఫ్ సెంచరీ ముంగిట నిలిచాడు. ఆర్ అశ్విన్ వేసిన ఇన్నింగ్స్ పదకొండో ఓవర్లో రోహిత్ షాట్ ఆడగా.. సర్కిల్ లోపలే ఫీల్డింగ్ చేస్తున్న ప్రవీణ్ దూబే వైపు బంతి దూసుకెళ్లింది. అయినా కూడా రోహిత్ అనవసర పరుగు కోసం ప్రయత్నించాడు. సూర్యకుమార్ యాదవ్ వద్దని వారిస్తున్నా.. నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపు దూసుకొచ్చాడు. ఇద్దరు బ్యాట్స్‌మెన్ ఒకే వైపు క్రీజ్‌లోకి రాగా.. దూబే బంతిని వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ వైపు విసిరాడు. ఇద్దరిలో ఒకరు రనౌట్ కావడం తప్పదని గ్రహించిన సూర్య.. రోహిత్ క్రీజులోకి రాగానే అతడు బయటకి వెళ్ళిపోయాడు. దీంతో సూర్య రనౌట్ అయ్యాడు. మ్యాచ్ అనంతరం ఈ ఘటనపై సూర్యకుమార్ యాదవ్‌ని అడగ్గా.. కెప్టెన్ కోసం సంతోషంగా నా వికెట్ త్యాగం చేశా అని పేర్కొన్నాడు. సూర్యకుమార్ చేసిన త్యాగంపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. 'ముంబై కోసం రోహిత్ ఐదు టైటిల్స్ గెలిచాడు కానీ.. సూర్యకుమార్ మా హృదయాలను గెలుచుకున్నాడు' అని ఓ అభిమాని ట్వీట్ చేయగా.. 'బంగారు మనసున్న సూర్యకుమార్.. కెప్టెన్ కోసం తన వికెట్ త్యాగం చేశాడు' అని మరో అభిమాని ట్వీటాడు. 'సూర్యకుమార్ మా హృదయాలను గెలుచుకున్నాడు', 'సూర్యకుమార్ టీమిండియాలోకి రావాలి', 'లవ్ యూ సూర్యకుమార్' అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.