హింసపై పోరాడుతున్న పింక్‌ బెల్ట్‌ మిషన్‌

 


మహిళలకు సంక్షేమం... భద్రత కల్పించడం అత్యంత కీలకమైన అంశాలు. రోజురోజుకు పెరుగుతున్న హింస, వివక్ష... ఆర్థిక, సామాజిక రంగాలలో మహిళల భాగస్వామ్యాన్ని అణచివేస్తున్నాయి. దీన్ని మార్చాలనే ఉద్దేశ్యంతోనే 40 ఏండ్ల అపర్ణ రాజవత్‌ పింక్‌ బెల్ట్‌ మిషన్‌ అనే సంస్థకు పునాది వేశారు. ఇది ఆగ్రాలో ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా మహిళలకు ఆత్మరక్షపై అవగాహన కల్పిస్తుంది. హింసపై పోరాడటానికి కావల్సిన శక్తిని అందిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు (35 శాతం) తమ జీవిత కాలంలో ఏదో ఒక రూపంలో శారీరక లేద మానసిక హింసను అనుభవిస్తున్నారు. భారతదేశం విషయానికి వస్తే పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) ప్రకారం 2019లో దేశ వ్యాప్తంగా 4,05,861 నేరాలు నమోదయ్యాయి. 2018తో పోలిస్తే ఇది 7.3 శాతం పెరిగింది (3,78,236 కేసులు). ఈ దారుణాలలో ఎక్కువ భాగం హత్యలు, లైంగికదాడులు, వరకట్న మరణాలు, ఆత్మహత్యలు, యాసిడ్‌ దాడులు, కిడ్నాప్‌లు ఉన్నాయి. 2018లో థాంప్సన్‌ రాయిటర్స్‌ విడుదల చేసిన 548 మంది ప్రపంచ నిపుణుల పోల్‌... మహిళలకు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశంగా భారతదేశాన్ని పేర్కొన్నదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ఆత్మరక్షణ.. విద్య.. వృత్తి శిక్షణ కీలకం ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో అపర్ణ రాజావత్‌ 2016లో పింక్‌ బెల్ట్‌ మిషన్‌ స్థాపించారు. మహిళల ఆత్మరక్షణ, విద్య, వృత్తి శిక్షణ చుట్టూ కేంద్రీకృతమై ఈ సంస్థ పనిచేస్తుంది. ఈ మూడు వేర్వేరు కార్యక్రమాలను రూపొందించి విసృతంగా పని చేస్తుంది. ఇప్పటివరకు 1.5 లక్షల మంది అమ్మాయిలు, మహిళల జీవితాలను ఈ సంస్థ ప్రభావితం చేసింది. ఆత్మరక్షణే ఏకైక మార్గం ఆగ్రాలో పుట్టి పెరిగిన అపర్ణకు ఇద్దరు అన్నలు ఉన్నారు. వారు ఆమెను వేధించే వారు. విపరీతమైన విక్షను అనుభవించింది. వారు బయట స్నేహితులతో కలిసి గాలిపటాలు ఎగరేస్తూ, గిల్లి దండా ఆడుతూ వుంటే అపర్ణ మాత్రం ఇంటికే పరిమితమయ్యేది. ''టీనేజ్‌లోకి అడుగుపెడుతున్నప్పుడే కరాటే క్లాసుల్లో చేరాను. నన్ను నేను శక్తివంతం చేసుకోవడానికి, రక్షించుకోవడానికి ఏకైక మార్గం ఆత్మరక్షణ నేర్చుకోవడమే అని నాకు తెలుసు. అందుకే మార్షల్‌ ఆర్ట్‌ నేర్చుకున్నారు. ఆత్మరక్షణకు సంబంధించిన అనేక కదలికల్లో శిక్షణ పొందాను. అలాగే డ్యాన్స్‌ కూడా చేసే దాన్ని'' అంటూ అపర్ణ తన టీనేజ్‌ను గుర్తుచేసుకున్నారు. ప్రమాదానికి గురై... 18 ఏండ్ల వయసులో అపర్ణ ఓ ప్రమాదానికి గురైంది. అప్పుడు ఎన్నో గాయాలు అయ్యాయి. దాంతో తన శిక్షణను కొంతకాలం నిలిపివేయవలసి వచ్చింది. ఇక ఆమె దృష్టి చదువు వైపుకు మళ్ళింది. బి.ఆర్‌ అంబేద్కర్‌ యూనివర్సిటీ నుండి ఇంగ్లీష్‌ సాహిత్యంలో మాస్టర్స్‌ చదివారు. తరువాత సోలన్‌లోని మానవ్‌ భారతి విశ్వవిద్యాలయంలో ఎంబీఏ పూర్తి చేశారు. చదువు పూర్తయిన తర్వాత సేల్స్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగంలో చేరారు. కొంతకాలం తర్వాత అంతర్జాతీయ పర్యటనలకు టూర్‌ మేనేజర్‌గా మారింది. నిర్భయ ఘటనతో... 2012, డిసెంబర్‌లో ఢిల్లీలో కదిలే బస్సులో 23 ఏండ్ల అమ్మాయిపై జరిగన సామూహిక లైంగిక దాడి, హత్య అపర్ణను కలచివేసింది. ఈ సంఘటన జరిగినపుడు ఆమె విదేశాలలో పర్యటిస్తున్నారు. ఈ దారుణ సంఘటనతో భారతదేశంలో మహిళల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆమెకు అర్థమయింది. దాంతో మహిళలను శక్తివంతం చేయాలనే అపర్ణ సంకల్పం మరింత బలపడింది. దీనికోసం కొన్ని సంవత్సరాలు పరిశోధన చేసి చివరకు పింక్‌ బెల్ట్‌ మిషన్‌ను ప్రారంభించారు. సంస్థ ఖర్చుల కోసం ఆమె తన వ్యక్తిగత డబ్బునే ఉపయోగించేది. విద్యపై దృష్టి మహిళలు వారి సామాజిక, ఆర్థిక, వృత్తిపరమైన లక్ష్యాలను సాధించాలంటే ఉత్తమ సాధనాల్లో విద్య ఒకటి. కాబట్టి మొదటిగా విద్యపై అపర్ణ దృష్టి పెట్టారు. ప్రారంభంలో ఆగ్రాతో పాటు చుట్టుపక్కల ఉన్న పాఠశాల నుండి మధ్యలోనే చదువు మానేసిన అమ్మాయిలను గుర్తించారు. చదువుపై ఆసక్తి ఉండి కూడా చదువుకోలేని స్థితిలో ఉన్న అమ్మాయిలకు ఫీజులు స్పాన్సర్‌ చేసేవారు. ఇప్పటి వరకు పింక్‌ బెల్ట్‌ మిషన్‌ ద్వారా 28 మందికి పైగా బాలికలకు విద్యను అందించారు. ఆ తర్వాత వృత్తి శిక్షణపై దృష్టి పెట్టారు. ఇందుకోసం ఆగ్రాలో తారా ఇన్నోవేషన్స్‌ అనే షూ ఫ్యాక్టరీ నడుపుతున్న వ్యాపారవేత్త మన్సీ చంద్రతో కలిసి అపర్ణ మహిళలకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. చదువులేని నిరుద్యోగ మహిళలకు షూ తయారీ, యంత్రాలను నడపడం, లైన్లను నిర్వహించడం వంటివి నేర్పించారు. 150 మంది మహిళలకు ఉపాధి చూపించారు. ఉచిత వర్క్‌ షాప్‌ లు మహిళలకు విద్య, వృత్తి నైపుణ్యంలో శిక్షణ అందిస్తూనే పింక్‌ బెల్ట్‌ మిషన్‌ బాలికలు, మహిళలకు ఆత్మరక్షణలో శిక్షణ ఇస్తుంది. ఈ సంస్థ తన కార్యకలాపాల కోసం యుపి పోలీస్‌ ఫోర్స్‌ (ఉమెన్‌ పవర్‌ లైన్‌తో సహా), రాజస్థాన్‌ స్టేట్‌ కమీషన్‌ ఫర్‌ ఉమెన్‌, యునిసెఫ్‌ సహాయం తీసుకుంటోంది. ''బాలికలు, మహిళల కోసం మూడు రోజుల పాటు ఉచిత వర్క్‌షాప్‌ను నిర్వహిస్తాం. ఆత్మరక్షణలో భాగంగా వివిధ సాధనాలు, పద్ధతుల గురించి వారికి అవగాహన కల్పిస్తాం. లైంగిక దాడుల నుండి కాపాడుకోవడంపై వారిని వ్యక్తిగతంగా కొన్ని సెషన్లను తీసుకుంటాను. స్త్రీలను మానసికంగా, శక్తివంతం చేయడం చుట్టూ మా సంస్థ తిరుగుతుంది ''అంటున్నారు అపర్ణ. ప్రభుత్వం సహకరిస్తే... ''నేను ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్ళలో ఒకటి ప్రభుత్వ అధికారుల సహకారం లేకపోవడం. మిషన్‌ కార్యకలాపాలను మరింత విస్తృత పరచాలనే ఉద్దేశంతో వారితో కలిసి పనిచేయడానికి నా ఆసక్తిని తెలియజేస్తూ ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వానికి పలుసార్లు లేఖ రాశాను. అయితే ఇంతవరకు వారి నుండి నాకు స్పందన రాలేదు. ప్రభుత్వం నుండి సహకారం అందితే మా సంస్థ చాలా మంది మహిళలకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నాను'' అంటున్నారు అపర్ణ. నాపై నాకు నమ్మకం వచ్చింది సంస్థ ప్రారంభమైనప్పటి నుండి సుమారు 1.5 లక్షల మంది శిక్షణ ఇచ్చారు. గోరఖ్పూర్‌, ఆగ్రా, నోయిడా, జైపూర్‌, వారణాసి, పూణే, లక్నో అంతటా అనేక నగరాలలో వీరు ఉన్నారు. వారిలో 33 ఏండ్ల ఆశా సింగ్‌ ఒకరు. ఆగ్రాలో ఐటి రంగంలో పని పచేసే ఆశా 2018లో పింక్‌ బెల్ట్‌ మిషన్‌ నిర్వహించిన ఆత్మరక్షణ వర్క్‌షాప్‌కు హాజరైంది. ''వర్క్‌షాప్‌లో చాలా నేర్చుకున్నాను. ఇతరులపై ఆధారపడకుండా భద్రతను నా చేతుల్లోకి ఎలా తీసుకోవచ్చో అర్థం చేసుకున్నాను. నన్ను నేను కాపాడుకోగలను అనే నమ్మకం కలిగింది. అంతేకాకుండా ఈ శిక్షణ వల్ల నా శారీరం కూడా దృఢంగా తయారయింది'' అంటుంది ఆశా. అసమానతలు ఎదుర్కొన్నాను భారతదేశంలో పుట్టిన ఒక మహిళగా నేను ఎన్నో అన్యాయాలు, అసమానతలను అనుభవించాను. చివరికి వాటిని ఎదిరించాలని నిర్ణయించుకున్నాను. స్వతంత్ర జీవితాన్ని గడపడానికి అవసరమైన నైపుణ్యం సంపాదించడం, నాపైన నేను విశ్వాసం పొందడం చాలా అవసరమని అర్థం చేసుకున్నాను. నేను చూసిన ఇతర స్త్రీలు కూడా ఇదే రకమైన సమస్యలు, అణచివేతలతో బాధపడుతున్నారు. అలాంటి బాధలు స్త్రీలకు లేకుండా చేయాలని భావించాను. అందుకే పింక్‌ బెల్ట్‌ మిషన్‌ను స్థాపించాను.