జీహెచ్ఎంసీ ఎన్నికలకు అడుగులు వేగంగా పడుతున్నాయి


 

GHMC Elections: జీహెచ్ఎంసీ ఎన్నికలకు అడుగులు వేగంగా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్ధసారధి అఖిలపక్ష నేతలతో సమావేశమయ్యారు. వార్డుల వారీ ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, మోడల్ కోడ్, అభ్యర్థుల ఎన్నికల ఖర్చు తదితర అంశాలపై ఆయన చర్చించారు. 2021 ఫిబ్రవరి 10వ తేదీన జీహెచ్ఎంసీ పదవీకాలం ముగుస్తుండటంతో.. ఆలోగా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఎస్ఈసీపై ఉందన్న ఆయన.. రేపు 150 వార్డులకు ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. అలాగే తుది పోలింగ్ కేంద్రాల జాబితాను ఈ నెల 21వ తేదీన ప్రకటిస్తారని అన్నారు. మరోవైపు ఎన్నికల నిర్వహణకు అవసరమైన రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులను నియమించామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి స్పష్టం చేశారు. దీపావళి తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నందున.. నోటిఫికేషన్ విడుదలైన దగ్గర నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందని, దానిని అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తప్పక పాటించాలన్నారు. కాగా, వార్డు డీలిమిటేషన్ బౌండరీల ప్రకారం ఓటర్ల తుది జాబితాను రూపొందించాలని ఎన్నికల ఆథారిటీ, జీహెచ్ఎంసీ కమీషనర్, డిప్యుటీ మున్సిపల్ కమిషనర్లను ఎస్ఈసీ ఆదేశించారు