దీపావళి... వెలుగులు విరజిమ్మే పండుగ. ఆరోజున కాలుష్యానికి కారణమయ్యే టపాసులు కాల్చడం ఆరోగ్యానికే కాదు పర్యావరణానికి హానికరం. అంతేకాదు ఈసారి కరోనా వైరస్, పర్యావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని పలు రాష్ట్రాలు కొన్ని ప్రధాన నగరాల్లో టపాసులు కాల్చడాన్ని నిషేధించాయి. కర్ణాటక కూడా వీటిలో ఒకటి. బెంగళూరులో చాక్లెట్ దుకాణం నిర్వహించే ప్రియాజైన్కు కూడా చాక్లెట్ క్రాకర్స్ తయారుచేయాలనే ఆలోచన వచ్చింది. ఆమె దుకాణంలో రాకెట్స్, సుతిల్ బాంబ్స్, హైడ్రోజన్ బాంబ్స్... అన్ని రకాల క్రాకర్స్ లభిస్తాయి. అయితే అవి కాల్చేటివి కాదు. తినేటివి. అవన్నీ టపాకాయల రూపంలో ఉన్న చాక్లెట్స్. ''చాలామంది పిల్లలు, పెద్దలకు దీపావళి రోజున టపాకాయలు కాల్చనిదే పండుగలా అనిపించదు. అందుకే నేను స్వీట్లను టపాసుల ఆకారంలో తయారుచేశాను. పండుగ రోజున కాలుష్యాన్ని పెంచకుండా ఈ తీపి టపాసులతో సంతోషాలు పంచాలనేది నా ఆలోచన. చాలామంది ఈ స్వీట్ క్రాకర్స్ కొనేందుకు ఆసక్తి చూపుతుండడం సంతోషంగా ఉంది'' అంటారు ప్రియా జైన్. ఈ టపాసులు మొలకెత్తుతాయి! ఈసారి దీపావళి రోజున కాలుష్యరహిత సీడ్ క్రాకర్స్‌తో విభిన్నంగా జరుపుకోండి. 'సీడ్ పేపర్ ఇండియా' సంస్థ తయారుచేసిన ఈ సీడ్ క్రాకర్స్ పువ్వులు, పండ్లు, కూరగాయల మొక్కలుగా మొలకెత్తుతాయి. ప్రతి బాక్స్‌లో ఏడు రకాల సీడ్ క్రాకర్స్ ఉంటాయి. సీడ్ బాల్‌ను కాగితం గుజ్జు లేదా మట్టితో తయారు చేస్తారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని పలువురు ఇలాంటి క్రాకర్స్‌ను కొనేందుకు ఆసక్తి చూపుతుండడం విశేషం.