పబ్ జీ ప్లేయర్స్ కి గుడ్ న్యూస్ : పాత ఐడి తో ఆడుకోవచ్చు


ప్రపంచ వ్యాప్తంగా ఆధరణ పొందిన PUBG మొబైల్ గేమ్‌ను మళ్లీ భారత వినియోగదారులకు సరికొత్తగా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ గేమ్‌ను కేంద్ర ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం బ్యాన్ చేసింది. దీంతో నిబంధనలకు అనుగుణంగా పాలసీల్లో మార్పులు చేసి కొత్త పబ్జీ గేమ్‌ను రూపొందించామని ఆ సంస్థ చెబుతోంది. కొత్త గేమ్‌ ఎలా రూపొందుతుందనే అంశంపై అంచనాలు పెరుగుతున్నాయి. నిషేధానికి ముందు ఉపయోగించిన గేమర్ IDలతోనే కొత్త గేమ్‌ ఉండే అవకాశం ఉంది. అంటే PUBG మొబైల్ ఇండియా గేమ్‌ ఆడాలనుకునే వారు ప్రత్యేకంగా IDని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. పాత ఐడీతో ఉన్న అఛీవ్‌మెంట్స్, రివార్డులు, స్కిన్న్ వంటివి మళ్లీ కనిపిస్తాయి. కొత్త గేమ్‌ డేటా స్టోరేజ్ కోసం PUBG కార్పొరేషన్, దాని మాతృ సంస్థ KRAFTON మైక్రోసాఫ్ట్‌తో కలిసి పనిచేయనున్నాయి. మైక్రోసాఫ్ట్‌ అజూర్ క్లౌడ్ సేవలను ఈ సంస్థలు ఉపయోగించనున్నాయి. అప్పట్లో డేటా స్టోరేజ్ కోసం పబ్జీ అమెజాన్ వెబ్ సర్వీసెస్‌తో కలిసి పనిచేసింది. కానీ 2017 అక్టోబర్లో PUBG ఎక్స్‌బాక్స్ వెర్షన్ మొబైల్ గేమ్ డేటా స్టోరేజీ కోసం మైక్రోసాఫ్ట్ అజూర్‌కు ఆ సంస్థ మారింది. ఇప్పుడు మొబైల్, పీసీ, కన్సోల్ వెర్షన్ల డేట కోసం పబ్జీ అజూర్‌ను ఉపయోగిస్తుందని భావిస్తున్నారు. కొత్త గేమ్ గురించి PUBG కార్పొరేషన్ ఇటీవల ఒక ప్రకటన విడుదల చేసింది. మన దేశంలో ఈ గేమ్‌ను నిషేధించిన తరువాత, PUBG మొబైల్ ఇండియా అనే కొత్త గేమ్‌ను రూపొందిస్తున్నామని ఆ సంస్థ ప్రకటించింది. భారతదేశం కోసం ప్రత్యేకంగా గేమ్‌లో వివిధ అంశాలను సర్దుబాటు చేసినట్లు తెలిపింది. 'ఇండియన్ గేమర్స్ కోసం ప్రత్యేకంగా కొన్ని మార్పులు చేశాం. వర్చువల్ సిమ్యులేషన్ ట్రైనింగ్ గ్రౌండ్, గ్రీన్ హిట్ ఎఫెక్ట్స్‌, యువ ఆటగాళ్లలో ఆరోగ్యకరమైన గేమ్‌ప్లే అలవాట్లను ప్రోత్సహించడానికి గేమ్ టైమ్ లిమిట్స్ వంటి సరికొత్త ఫీచర్లను అభివృద్ధి చేశాం' అని పబ్జీ కార్పొరేషన్ వెల్లడించింది.PUBG కార్పొరేషన్ మాతృ సంస్థ అయిన KRAFTON మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. వీడియో గేమ్స్, ఈ స్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్, ఐటీ పరిశ్రమల విభాగంలో సుమారు 100 మిలియన్ డాలర్లను ఆ సంస్థ పెట్టుబడి పెట్టనుంది. PUBG మొబైల్ ఇండియా గేమ్ ఇప్పటి నుంచి కొత్త ఇండియన్ సబ్సిడరీ కంపెనీ యాజమాన్యంలోకి మారనుంది. కొత్త గేమ్ ఎప్పుడు విడుదల అవుతుందనే వివరాలు అధికారికంగా వెల్లడికాలేదు. గేమ్‌ను త్వరలో విడుదల చేస్తామని మాత్రమే డెవలపర్లు చెప్పారు. దీనికి సబంధించి PUBG కార్పొరేషన్, దాని ఇండియన్ సబ్సిడరీ కంపెనీలకు భారత ప్రభుత్వ ఆమోదాలు, అనుమతులు ఉన్నాయా లేదా అనేది కూడా స్పష్టంగా తెలియదు. దీంతో కొత్త గేమ్‌ ఎప్పుడు వస్తుందోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు.