కరోనా చికిత్సలో. రెమిడెసివిర్‌ వాడొద్దు----who సూచన


 

ప్రాణాంతక కరోనా వైరస్‌కు చికిత్సలో భాగంగా మెరుగైన ఫలితాల కోసం వినియోగిస్తున్న యాంటీవైరల్‌ ఔషధం రెమిడెసివిర్‌ వినియోగంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కీలక సూచనలు చేసింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు ఈ ఔషదాన్ని వినియోగించరాదని పేర్కొంది. కరోనా సోకిన వ్యక్తి ఎంతటి అనారోగ్యానికి గురైనా ఈ ఔషధాన్ని చికిత్సకు వాడరాదని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కోవిడ్‌-19పై ఇది ప్రభావం చూపుతున్నట్లు ఎలాంటి ఆధారాలూ లభించలేదని తెలిపింది. రికవరీ రేటు, వెంటిలేటర్‌ అవసరాన్ని తగ్గించడంలో రెమిడెసివిర్‌ ఆశాజనక ఫలితాలను ఇవ్వడం లేదని పేర్కొంది. కోవిడ్‌-19తో ఆస్పత్రిలో చేరిన ఏడు వేల మందిపై జరిపిన అధ్యయన వివరాల్ని పరిశీలించిన తర్వాత ఈ ప్రకటన చేస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌వో గైడ్‌లైన్ డెవలప్‌మెంట్ గ్రూప్ (జీడీసీ)తెలిపింది. అయితే, రెమిడెసివిర్‌ వల్ల ఎలాంటి ప్రయోజనాలూ లేవని చెప్పడం మాత్రం తమ ఉద్దేశం కాదని జీడీసీ వెల్లడించింది. కొవిడ్‌-19 బాధితులకు ఇస్తున్న సాధారణ చికిత్సతో పోలిస్తే ఈ ఔషధం అందించడానికి అవుతున్న ఖర్చు, ఇస్తున్న విధానం అంత ప్రయోజనకరంగా ఏమీ లేదన్నదే తమ అభిప్రాయం అని స్పష్టంచేసింది. కరోనా బారిన పడిన వారు త్వరగా కోలుకోవడంలో రెమిడెసివిర్‌ బాగా పనిచేస్తోందని కొన్ని ప్రాథమిక అధ్యయనాలు సూచించిన విషయం తెలిసిందే. దీంతో అమెరికా సహా ఐరోపా దేశాల్లో అత్యవసర పరిస్థితుల్లో వైద్యుల సలహా మేరకు దీన్ని వినియోగించడానికి అనుమతి లభించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సైతం దీన్ని వినియోగించారు. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌వో ఈ ప్రకటన చేయడం గమనార్హం. రెమిడిసివిర్ వినియోగంపై గత నెలలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. తీవ్ర లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన కరోనా రోగులపై గిలిద్‌ సైన్సెస్‌కు చెందిన రెమ్‌డెసివిర్ ఎటువంటి ప్రభావం చూపడంలేదని తెలిపింది. బాధితులు కోలుకునే సమయం సహా మరణం ముప్పును తగ్గించడంలోనూ ఈ ఔషధం దోహదపడలేదని తేలింది. కరోనా చికిత్సలో రెమ్‌డెసివిర్‌, హైడ్రాక్సీక్లోరోక్విన్‌, లోపినవిర్‌(రిటోనవిర్‌), ఇంటర్‌ఫెరాన్‌ ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు 30 దేశాలకు చెందిన 11,266 మంది వయోజనులపై డబ్ల్యూహెచ్ఓ క్లినికల్ ప్రయోగాలు నిర్వహించింది. మరణం ముప్పు తప్పించడం, ఆసుపత్రిలో ఉండే సమయాన్ని తగ్గించడంలో ఈ ఔషధాలు ఎలాంటి ప్రభావం చూపించడం లేదని ఆ ప్రయోగాల ద్వారా గుర్తించినట్లు డబ్ల్యూహెచఓ తెలిపింది. అయితే, ప్రయోగ ఫలితాలను ఇంకా సమీక్షించాల్సి ఉందని పేర్కొంది.