జనవరి 1నుంచి వాటర్ పై కొత్త నిబంధనలు అమలు.

 


దేశంలో విక్రయించే ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌పై జనవరి 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. ప్యాకేజింగ్ చేసి విక్రయించే లీటర్ మంచి నీటిలో 20 మిల్లీగ్రాముల కాల్షియం, 10 మిల్లీగ్రాముల మెగ్నీషియం తప్పనిసరిగా ఉండాలని సూచిస్తూ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ) కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. మంచి నీటిని శుద్ధి చేయడంలో భాగంగా శరీరానికి అవసరమయ్యే ఖనిజాలను తొలిగిస్తున్నారని.. అవి ఆరోగ్యానికి ఎంతగానో అవసరమని.. వాటిని ప్యాకేజీ చేసిన తాగునీటిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జిటి) ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐని కోరింది. ఇందులో భాగంగానే జనవరి 1 నుంచి కొత్త రూల్స్‌ను అమలు చేసేందుకు సిద్ధమైంది. ఖనిజ లవణాలు, కాల్షియం, మెగ్నీషియం ఉండే విధంగా మంచి నీటిని శుద్ధి చేసేలా వాటర్ ప్లాంట్లలో మార్పులు చేసుకోవాలని ఆయా సంస్థలకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ డిసెంబర్ 31 గడువును ఇచ్చింది. జనవరి 1వ తేదీ నుంచి హిమాలయన్, బైలే, రైల్‌నీర్, ఆక్సీరిచ్, టాటా వాటర్‌ వంటి ప్రముఖ బ్రాండ్లు కొత్త నిబంధనలకు అనుగుణంగా ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయనున్నాయి. కాగా, ఇప్పటికే కిన్లే సంస్థ న్యూ రూల్స్‌కు తగిన విధంగా ప్యాకేజ్డ్ నీటిని మార్కెట్‌లోకి విడుదల చేసింది