ఎఫ్3 సినిమా షూటింగ్ ప్రారంభం.

 


విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్, మిల్కీ బ్యూటీ తమన్నా, మెహరీన్‏లు నటించిన f2 మూవీ మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రముఖ హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కించగా.. ఈ చిత్రం గతేడాది బాక్సాఫీసు ముందు సూపర్ హిట్‏గా నిలించింది. తాజాగా ఎఫ్2 సీక్వెల్‏గా ఎఫ్3 సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి కూడా అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రారంభ పూజ కార్యక్రమం హైదరాబాద్‏లో గురువారం జరిగింది. హీరోయిన్ తమన్నా, హీరో వరుణ్ తేజ్‏ల ఒక సన్నివేశానికి నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. కాగా ఈ షూటింగ్ ప్రారంభ కార్యాక్రమంలో విక్టరీ వెంకటేశ్ కనిపించలేదు. ప్రస్తుతం వెంకటేశ్ నారప్ప మూవీ షూటింగ్‏లో బిజీగా ఉండటమే దీనికి కారణం. వెంకీతో పాటు మెహరీన్ కూడా ఈ కార్యాక్రమంలో కనిపించలేదు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ మాట్లాడుతూ.. గత సంవత్సరం మా బ్యానర్‏లో విడుదలైన F2 మంచి కామెడీతో సూపర్ హిట్ సాధించిన విషయం మీకు తెలిసిందే. అన్ని కుదిరితే F2 సీక్వెల్‏గా F3 సినిమాను రూపొందిస్తామని చెప్పాం. దానికి మరింత వినోదాన్ని జతచేసి F3 కథను అనిల్ రావిపూడి సిద్ధం చేశారు. వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్‏ల కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులను మరింత నవ్విస్తుందని అనుకుంటున్నాం. డిసెంబర్ 23 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‏ను ప్రారంభిస్తున్నాం అని చెప్పారు. అయితే ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.