జనవరి 4న వరంగల్ లో పర్యటించనున్న పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు.

 


వచ్చే ఏడాది జనవరి 4వ తేదీన రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, చేనేత, పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వరంగల్‌లో పర్యటిస్తారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రకటించారు. ఈ సందర్భంగా వరంగల్‌లోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ప్రజాప్రతినిధలు, అధికారులతో సమీక్ష నిర్వహించి పలు విషయాలను వెల్లడించారు. మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారని తెలిపారు. డబుల్ బెడ్‌రూంల ప్రారంభోత్సవాలు, నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ, వైకుంఠ ధామాలకు శంకుస్థాపన, నాలాలు, నగరంలోని మరమ్మతులకు శంకుస్థాపనలు, కొత్త పార్కుల ప్రారంభం, వరంగల్ రైల్వే ఓవర్ బ్రిడ్జి ప్రారంభం, నైట్ షెల్టర్లకు శంకుస్థాపనలు చేస్తారని వివరించారు. వీటికోసం అధికారులు, ప్రజాప్రతినిధులు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కేటీఆర్ పర్యటన సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు అందుబాటులో ఉండాలని మంత్రి దయాకర్ రావు పేర్కొన్నారు