దేశంలోనే తొలి 5జి ఇన్నోవేషన్ ల్యాబ్.

 


తెలంగాణలో క్రమంగా ఫారెన్ ఇన్వెస్టిమెంట్స్ పెరుగుతున్నాయి.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మరింతగా పెరిగాయి. ఇటీవలే అమెజాన్ వెబ్ సర్వీస్ రూ.20,761 కోట్లతో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఇవే కాకుండా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గూగుల్, ఫేస్‌బుక్, ఆపిల్ వంటి సంస్థల‌తో పాటు ఫియ‌ట్ క్రిస్లర్ సంస్థలు కూడా పెట్టుబ‌డులు పెడుతున్నట్లు ప్రక‌టించిన విష‌యం తెలిసిందే. తాజాగా హైద‌రాబాద్‌కు మ‌రో భారీ పెట్టుబ‌డి వ‌స్తున్నట్లు ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదిక‌గా ప్రక‌టించారు. హైద‌రాబాద్‌కు ఒప్పో 5జీ ఇన్నోవేష‌న్ ల్యాబ్ వ‌స్తుంద‌ని పేర్కొన్నారు. ఇది దేశంలోనే మొద‌టి 5జీ ఇన్నోవేష‌న్ ల్యాబ్ అని వెల్లడించారు.పెట్టుబ‌డుల‌కు హైద‌రాబాద్ సానుకూల‌మ‌ని మ‌రోసారి నిరూపిత‌మైంద‌ని కేటీఆర్ స్పష్టం చేశారు. విదేశీ కంపెనీలు రాష్ట్రానికి రావడంతో మరిన్ని ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.