తిరుగు ప్రయాణానికి చాంగ్‌-5 మిషన్ రెడీ

 


బీజింగ్‌: అమెరికా, రష్యా తర్వాత చంద్రుడిపై కాలుమోపిన మూడో దేశంగా నిలిచిన చైనా.. చాంగ్‌-5 మిషన్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నది. గత నెల 24న చాంగ్‌-5ను డ్రాగన్‌ దేశం ప్రయోగించగా ఇప్పటికే నమూనాలు సేకరించే పనిని పూర్తిచేసింది. చంద్రుడి ఉపరితలంపై నుంచి దాదాపు 2 కిలోల శిలలు, మట్టి నమూనాలు సేకరించిన ఈ అంతరిక్ష నౌక భూమిపైకి తిరుగుప్రయాణానికి సిద్ధమైంది. ఆదివారం నాటికి నమూనాలను సేకరించే పనిని పూర్తి చేసింది. త్వరలోనే చాంగ్‌-5లోని రిటర్నర్‌ ఆ నమూనాలతో భూమిపై అడుగు పెట్టనున్నదని చైనా జాతీయ అంతరిక్ష సంస్థ(సీఎన్‌ఎస్‌ఏ) పేర్కొన్నది. ఈ మిషన్‌ ద్వారా భవిష్యత్తులో చంద్రుడిపై మరిన్ని పరిశోధనలు చేసేందుకు వీలవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతమైతే చంద్రుడి ఉపరితలంపై వాతావరణ పరిస్థితులను మరింత లోతుగా అధ్యయనం చేసే వీలు కలుగుతుందన్నారు.