ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం.

 


మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 70 పరుగుల టార్గెట్‌ను భారత్ సునాయాసంగా చేధించింది. లక్ష్య చేధనలో ఓపెనర్ మయాంక్ అగర్వాల్(5), పుజారా(3) విఫలమైనా.. గిల్(35), రహనే(27) మరోసారి రాణించారు. దీనితో రెండో టెస్ట్ మ్యాచ్‌ను భారత్ నాలుగు రోజుల్లోనే ముగించింది. కాగా, ఈ ఫలితంతో నాలుగు టెస్టుల సిరీస్ 1-1తో సమమైంది. అంతకముందు 133/6 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్.. మరో 67 పరుగులు జోడించి మిగిలిన నాలుగు వికెట్లను కోల్పోయింది. గ్రీన్(45), కమిన్స్(22), స్టార్క్(14) రాణించడం వల్ల ఆ మాత్రం స్కోర్ సాధించగలిగింది. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 195 పరుగులకు ఆలౌట్ కాగా.. టీమిండియా 326 పరుగులు చేసింది.