చంద్రుడి పై కార్ రేసులు...!

 


చంద్రుడి పైన కార్లు రయ్మంటూ తిరగబోతున్నాయి.. త్వరలో అక్కడ కూడా కార్ రేస్ లు జరగనున్నాయి. ఇది జోక్ కాదండి నిజమే త్వరలో చంద్రుడిపై కార్లను పంపనున్నారు. ఇందుకోసం అమెరికా హైస్కూల్‌ విద్యార్థులు రెండు కార్లను డిజైన్‌ చేయనున్నారు. ఈ కార్లను రిమోట్ కంట్రోల్ ద్వారా నడపనున్నారు. భూమిమీద నుండే రిమోట్ ద్వారా అక్కడ కార్లను నడపనున్నారు. 2021 అక్టోబర్‌లో జాబిల్లిపైనా కార్ రేస్ కూడా నిర్వహించనున్నారట. మూన్‌ మార్క్‌ మిషన్‌–1 పేరుతో అమెరికాలో 6 వేర్వేరు హైస్కూల్‌ విద్యార్థులతో కార్లను డిజైన్‌ చేయించనున్నారు. రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా సంకేతాలు పంపొచ్చని, ఇంట్యూటివ్‌ మెషీన్స్‌ ల్యాండర్‌ను వైఫైతో కనెక్ట్‌ చేయడం ద్వారా రేసు నడుస్తుందని కంపెనీ సీటీవో తెలిపారు . ఇక చంద్రుడి పైకి పంపే కార్లు సైజు చాలా చిన్నగా ఉండనుంది. ఒకొక్క కారు బరువు 2.5 కిలోలు ఉండనుంది. ఇలా రెండు కారులను పంపనున్నారు. అలాగే చంద్రుడి పైన కార్లను దింపే వస్తువు బరువు 3 కిలోలు ఉండనుంది. ఇలా రెండు కార్లు వాటిని దించేందుకు ఉపయోగించే ఒక వస్తువు మొత్తం 8 కిలోల బరువును చంద్రుడి పైకి పంపనున్నారు. అయితే ఈ ఎనిమిది కిలోల బరువు ఖర్చు మాత్రం భారీగానే ఉంది. వీటిని అక్కడికి తీసుకెళ్లేందుకు కనీసం రూ.73 కోట్లు ఖర్చు కానుందట. ముందుగా స్పేస్‌ ఎక్స్‌ కంపెనీకి చెందిన ఫాల్కన్‌–9 రాకెట్‌ ద్వారా ఇంట్యూటివ్‌ మెషీన్స్‌ అనే కంపెనీ తయారు చేసిన ‘నోవా–సీ’ ల్యాండర్ ద్వారా జాబిల్లిపైకి చేరనుంది. ఆ తర్వాత ‘నోవా–సీ’ ద్వారా ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆతర్వాత కార్లను పంపనున్నారు. ఇక ఈ కార్ రేస్ ను లైవ్ లో ప్రసారం చేయాలని ఈ పోటీని నిర్వహిస్తున్న మూన్‌మార్క్‌ కంపెనీ భావిస్తోంది. మరి ఇది సాధ్యమా.. అసాధ్యమా అన్నది తెలియాలంటే 2021 అక్టోబర్ వరకు ఎదురు చూడాల్సిందే.