ఘరానా దొంగ అరెస్టు........

 


వందల ఇళ్లలో దొంగతనాలు చేసిన గజదొంగ మంత్రి శంకర్‌ను నార్త్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అతడితో పాటు అతని అనుచరులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 12 లక్షల నగదు, బంగారు ఆభరణాలు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, నిందితుడు మంత్రి శంకర్ నేర చరిత్ర గురించి పోలీసులు వివరించారు. మంత్రి శంకర్ పై మూడు కమిషనరేట్ల పరిధిలో 250కి పైగా కేసులు నమోదైనట్లు తెలిపారు. నిందితుడు 1979 నుంచి దొంగతనాలు చేస్తున్నాడని, ఇప్పటికే పలుసార్లు అరెస్ట్ చేసి, జైలుకు సైతం పంపామని అన్నారు. ఇప్పటికే అతడిపై నాలుగు సార్లు పీడీ యాక్ట్ కేసులు నమోదు చేశామని తెలియజేశారు. ఇటీవలే జైలు నుంచి… పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘరానా దొంగ శంకర్ డిసెంబర్ 4నే జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ నెల వ్యవధిలోనే 6 దొంగతనాలు చేసినట్లు తెలిపారు. కాగా ఆ ఆరు దొంగతనాలు కుషాయిగూడ, వనస్థలిపురం, బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగాయి. అయితే శంకర్ గ్యాంగ్ పగలు రెక్కీ చేసి రాత్రి 1 నుంచి 4 గంటల మధ్య దొంగతనాలకు పాల్పడుతుందని వివరించారు. శంకర్ అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకోగా… అబ్దుల్ లతీఫ్ పై 10, మజీద్ పై 7, అహ్మద్ పై 13 కేసులు ఉన్నాయి.