నిమ్స్ లో జన్యు విశ్లేషణ కేంద్రం......

 


ఒక వైపు క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తుంటే మ‌రో వైపు కొత్త క‌రోనా వైర‌స్ మ‌రింత ఆందోళన క‌లిగిస్తోంది. గ‌త ఎనిమిది నెల‌లుగా భ‌య‌పెడుతున్న క‌రోనా.. కాస్త త‌గ్గుముఖం ప‌డుతున్న త‌రుణంలో మ‌రో కొత్త స్ట్రైయిన్ ‌వైర‌స్ గుండెల్లో ద‌డ పుట్టించేలా చేస్తోంది. దీంతో తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రింత అప్ర‌మ‌త్త‌మైంది. ఇక ఈ కొత్త కరోనా వైరస్ జన్యు విశ్లేషణను చేయడానికి సంబంధించి కేంద్రాన్ని నిమ్స్ లో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఈ కేంద్రం ఏర్పాటుకు రూ.14 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది వైద్య ఆరోగ్యశాఖ. త్వరలో ముఖ్యమంత్రి ఆమోదం తర్వాత ఈ విషయంపై ముందుకెళ్లాలని భావిస్తోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని సీసీఎంబీ లో మాత్రమే జన్యుపరిశోధన కొనసాగుతోంది. అయితే కేంద్రం అందించిన స‌మాచారం ప్ర‌కారం.. న‌వంబ‌ర్ 23 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు గ‌త నెల రోజుల్లో బ్రిట‌న్ నుంచి తెలంగాణకు సుమారు 3 వేల మంది వ‌ర‌కు వ‌చ్చిన‌ట్లు అధికారుల‌కు నిర్ధారించుకున్నారు. నవంబర్ 23 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు వచ్చిన వారిని ఒక బృందంగా పెట్టారు. ఇక డిసెంబర్ 9 నుంచి ఇప్పటి వరకు వచ్చిన వారి సంఖ్య 1200లకు చేరింది. వీరిలో 800 మంది జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నారు. కాగా, ఇప్పటికే బ్రిటన్ మీదుగా డిసెంబర్ 9 నుంచి వచ్చిన వారిలో ఇప్పటికే 200 మంది కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 25 మంది ఫలితాలు వచ్చాయి. వీరిలో ఎవరికీ కరోనా లేదని తేలింది. ఈ నెల 9కి ముందు వచ్చిన వారిని పరీక్షించగా ఇద్దరికి పాజిటివ్ అని తేలింది. వీరిద్దరి నమూనాల్లో వైరస్ జన్యు శిశ్లేషణ చేసేందుకు ప్రయోగశాలకు పంపించారు. బ్రిటన్ నుంచి వచ్చిన ప్రయాణికులు, వారి కుటుంబ సభ్యుల చికిత్సకు 12 ఆస్పత్రులను ఎంపిక చేశారు అధికారులు. కొత్త కరోనా వైరస్ ను గుర్తించేందుకు ప్రయాణికులు, కుటుంబ సభ్యులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో పాజిటివ్ తేలితే ఆ వ్యక్తి నమూనాను జన్యువిశ్లేషణకు పంపిస్తారు. ప్రస్తుతం జన్యు విశ్లేషణ పరీక్షలు సీసీఎంబీలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. లండ‌న్ నుంచి నిజామాబాద్‌కు 26 మంది కాగా, లండన్ నుంచి భారత్ కు వచ్చిన ప్రయాణికులలో నిజామాబాద్ జిల్లాకు చెందిన వారు 26 మంది ఉన్నట్లు తేలింది. వీరి జాబితాను బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు పంపించారు. వీరిని గుర్తించి రక్తనమూనాలు సేకరించేందుకు అధికారులు ప‌రుగులు పెడుతున్నారు. ఇప్ప‌టికే క‌రోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న త‌రుణంలో మ‌రో కొత్త మాయ‌దారి క‌రోనా వ్యాపిస్తుండ‌టంతో మ‌రింత భ‌యాందోళకు గుర‌వుతున్నారు.