ప్రాజెక్టులపై ఏపీ సర్కార్ స్పెషల్ ఫోకస్.

 


పోలవరంపై ప్రభుత్వం ఫోకస్‌ పెరిగింది. అటు ఢిల్లీలో చర్చలను కంటిన్యూ చేస్తోంది. ఇటు ప్రాజెక్ట్‌ పనులను పరుగులు పెట్టిస్తోంది. వాటిని స్వయంగా చూసేందుకు పోలవరం సైట్‌కు వెళ్లబోతున్నారు సీఎం జగన్‌. సీఎం వైఎస్‌ జగన్‌ ఈ రోజు పోలవరంలో పర్యటించనున్నారు. ఆయన పర్యటనకు సంబంధించి జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో పోలవరం నిర్మాణ పనులతో పాటు స్పిల్ వే, స్పిల్ చానల్ పనులను స్వయంగా పరిశీలించనున్నారు సీఎం జగన్‌. అనంతరం పోలవరం నిర్మాణ పనులపై అధికారులు, కాంట్రాక్టర్లతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. 2021 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తిచేయాలని సీఎం వైఎస్ జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. సీఎం జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పోలవరం పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో స్పిల్ వేలో 2,17,443 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ పనులు పూర్తి చేయగా.. స్పిల్ వే పిల్లర్ల పై 160 గడ్డర్లు ఏర్పాటుతో 52మీటర్ల ఎత్తుకు నిర్మించారు. గేట్ల ఏర్పాటులో కీలకమైన 48 ట్రూనియన్ భీంలకు గాను 30 ట్రూనియన్ భీంల నిర్మాణం పూర్తి చేశారు. కరోనా కాలంలోను లక్ష క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనితో పాటు స్పిల్ ఛానల్ లో 1,10,033 క్యూబిక్ మీటర్లు.. అలాగే 10,64,417 క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పనులు పూర్తి చేశారు. 902 కొండ తవ్వకం, గ్యాప్ 3, గ్యాప్ 1, గ్యాప్ 2 పనులు వేగంగా సాగుతున్నాయి. అయితే పోలవరం డిజైన్‌ మారుస్తున్నారంటూ విపక్షాలు ఇప్పటికే విమర్శలు ఎక్కుపెట్టాయి. ప్రాజెక్టు ఎత్తు తగ్గించి కడుతున్నారని.. ఆంధ్రులకు అన్యాయం జరుగుతోందని ఇప్పటికే టీడీపీ విమర్శలు చేసింది. దీనికి వైసీపీ మంత్రుల నుంచి కూడా గట్టి కౌంటర్‌ వచ్చింది. పోలవరం ఎత్తు టేప్‌ పెట్టి కొలుచుకోవాలని.. మంత్రి అనిల్‌ ధీటుగా జవాబిచ్చారు. డిజైన్‌ మార్చామా..? అదే డిజైన్‌తో కట్టామా అనేది త్వరలోనే అందరూ తెలుసుకుంటారన్నారు మంత్రి అనిల్‌. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సకాలంలో పూర్తయ్యేందుకు సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇప్పటికే కేంద్రం నుంచి నిధులు రప్పించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పటివరకు కేంద్రాన్ని ఒప్పించి ప్రాజెక్టు నిర్మాణానికి 2,234 కోట్ల నిధులు సాధించినట్లు ప్రభుత్వం చెబుతోంది.