యూకె ప్రభుత్వ శాఖల్లో చైనా సీక్రెట్ ఏజెంట్లు.

 


చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ తన వేళ్లను వేరే దేశాల్లో కూడా నాటుతోంది. ఊడలు చాస్తూ దెయ్యంలా మారబోతోంది. దీనికి నిదర్శనం ఇటీవల యూకేలో లీకైన డేటాలో బయటపడిన షాకింగ్‌ సీక్రెట్లే. బ్రిటన్‌లోని క్రీలక కంపెనీలు, యూనివర్సిటీలు, ప్రభుత్వ శాఖల్లో చైనా ఏజెంట్లు ఉన్నారన్న సంచలన వార్త.. ఇప్పుడు ప్రకంపనలు పుట్టిస్తోంది. బ్రిటన్‌కు సంబంధించిన దాదాపు 20 లక్షల మంది చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ సభ్యుల సమాచారం లీక్ అయింది. బ్రిటీష్ కాన్సులేట్లు, యూనివర్సిటీలతో పాటు యూకే కంపెనీల్లో CCP సభ్యులు ఉన్నట్లు తేలింది. జీవితాంతం పార్టీ కోసం పనిచేస్తామని, పార్టీకి ద్రోహం చేయమని ప్రమాణం చేసి ఈ కంపెనీలు, కీలక స్థానాల్లో చేరినట్లు తెలుస్తోంది. అంతెందుకు కరోనా టీకాలు తయారుచేసే ఫైజర్, ఆస్ట్రాజెనెకా కంపెనీల్లో ఉద్యోగులుగా వీరు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 123 మంది CCP సభ్యులు టీకా డెవలెప్‌మెంట్‌లో పాల్గొన్నారు. వీరి నుంచి ఎలాంటి డేటా చైనాకు చేరిందో ఇప్పటివరకు తెలియలేదు. CCP సభ్యుడిగా ఉన్న ఓ వ్యక్తి సెయింట్‌ ఆండ్రూస్‌ యూనివర్సిటీలో చదివి షాంఘైలో అనేక దౌత్యకార్యాలయాల్లో పనిచేశాడు. బ్రిటన్‌కు చెందిన దౌత్యకార్యాలయంలోనూ పనిచేసినట్లు తెలుస్తోంది. ఇక బ్రిటన్‌కు చెందిన హెచ్ఎస్బీసీ, స్టాండర్డ్‌ చార్టర్డ్‌ బ్యాంకుల్లోని 19 బ్రాంచ్‌ల్లో 600మంది చైనా పార్టీవర్కర్లు ఉన్నట్లు డేటా చెబుతోంది. ఈ రెండు బ్యాంకులకు చెందిన వ్యక్తులు.. హాంకాంగ్‌లో అల్లర్లు రేపినట్లు తెలుస్తోంది. ఇక బ్రిటన్‌ ఎయిర్‌ సెక్యూరిటీపైనా అనుమానాలు వస్తున్నాయి. ఎయిర్‌బస్‌, బోయింగ్‌, రోల్స్‌రాయిస్‌ కంపెనీల్లో వందలమంది చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ సభ్యులు ఉన్నట్లు తేలింది. ఈ కంపెనీలు యూకేకి రక్షణ పరికరాలు, ఆయుధాలు తయారుచేస్తున్నాయి. కేవలం యూకేలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక మల్టీనేషనల్ కంపెనీల్లో సీసీపీ సభ్యులు ఉన్నారని అంచనాలున్నాయి. అయితే ఇప్పటి వరకు వీరిలో ఎవరూ కూడా గూఢచర్యానికి, సమాచార దోపిడీకి పాల్పడ్డట్టు ఆధారాలు లభించలేదు.