రోజు రోజుకు రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు.

 


రోజు రోజుకు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా చాటు జనా జేబులను కొల్లగొడుతున్నారు. తాజాగా కొందరు కేటుగాళ్లు.. పే పాయింట్ అకౌంట్ ద్వారా డబ్బులు కొట్టేశారు. ఆధార్ నెంబర్, వేలి ముద్రల ఫోటోతో కొత్త రకం మోసానికి తెరలేపారు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సైబర్ నేరగాళ్లు ముందుగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రెవెన్యూ వెబ్ సైట్ నుంచి భూముల దస్తావేజులను డౌన్ లోడ్ చేసుకున్నారు. ఆ దస్తావేజుల్లో ఉన్న ఆధార్ కార్డు, వేలి ముద్రల ఫోటోలతో బ్యాంక్ అకౌంట్ నుంచి పే పాయింట్ అకౌంట్ ద్వారా నగదును విత్ డ్రా చేశారు. ఇలాగే మధురా నగర్‌ కాలనీకి చెందిన సిద్దిరెడ్డి వీర వెంకట సత్యనారాయణ మూర్తి అకౌంట్‌ను కూడా నిందితులు నగదును కాజేశారు. అయితే ఇది గమనించిన సత్యనారాయణ మూర్తి.. ఎస్ఆర్ నగర్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితులను గుర్తించి పట్టుకున్నారు. నిందితులు విశాల్, అర్షద్‌లుగా గుర్తించారు. వీరిద్దరూ సీఎ చదువుతున్నట్లు తెలిపారు. కేవలం ఆధార్ కార్డు, వేలి ముద్రల ఫోటో, నీటి చుక్కల సాయంతో పేపాయింట్ ద్వారా డబ్బు తస్కరించినట్లు నిందితులు వెల్లడించారు. వీరిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.