ఏపీ సర్కార్ ను అభినందించిన మోడీ ప్రభుత్వం.

 


ఆంధ్రప్రదేశ్ సర్కార్‌ను అభినందించింది నరేంద్ర మోదీ ప్రభుత్వం. కేవలం అభినందించడమే కాదు.. రుణ పరిమితి పెంపునకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. ఇంతకూ ఏ విషయంలో ఏపీ ప్రభుత్వానికి కితాబునిచ్చింది కేంద్ర ప్రభుత్వం ? కేవలం ఏపీనేనా మరే ఇతర రాష్ట్రాన్ని మోదీ ప్రభుత్వం అభినందించిందా? స్థానిక సంస్థల సంస్కరణల్లో ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ నెంబర్ వన్‌గా వున్నాయని అభినందించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు బుధవారం నాడు కితాబునివ్వడమే కాకుండా.. రెండు రాష్ట్రాలకు మరింత రుణ సౌకర్యానికి గ్రీన్ సిగ్నల్‌ కూడా ఇచ్చింది. స్థానిక సంస్థల సంస్కరణల అమలుకుగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2 వేల 525 కోట్ల రూపాయలు, మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి 2 వేల 373 కోట్ల రూపాయల రుణ సౌకర్యం కల్పించింది. మెరుగైన ప్రజారోగ్యం , పారిశుద్ధ్య నిర్వహణ, స్థానిక సంస్థల ఆర్థిక వనరుల బలోపేతం, మెరుగైన పౌర సేవలకు గుర్తింపుగా కేంద్రం వెసులుబాటును కల్పించింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రాల జీఎస్డీపీపై రెండు శాతం అదనంగా రుణం తీసుకునే సౌకర్యం కల్పించింది కేంద్ర ప్రభుత్వం. నాలుగు సంస్కరణలు అమలు చేస్తేనే రుణ సౌకర్యానికి అవకాశం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. ఈ సంస్కరణలను విజయవంతంగా అమలు చేసినందునే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు వెల్లడించింది.