ఏవియేషన్ రంగానికి ఎదురుదెబ్బ .కరోనా కారణంగా ఎగిరే విమానయాన సంస్థలకు నష్టాలు.

 


ఏవియేషన్ రంగానికి 2020లో ఎదురుదెబ్బ తగిలింది. కరోనా కారణంగా లాభాల్లో ఎగిరే విమానయాన సంస్థలకు నష్టాలు ఎదురయ్యాయి. అంతేకాకుండా కొవిడ్‌-19 కారణంగా నెలల తరబడి దేశ, విదేశీ విమాన సర్వీసులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. దీంతో విమానయాన సంస్థలు ఒక్కసారిగా నష్టాల్లోకి వెళ్లాయి. చాలా సంస్థలు ఆదాయం లేక ఆయా సంస్థలు ఉద్యోగుల్ని తొలగించగా, కొన్ని సంస్థలు కనీసం ఉద్యోగులకు జీతాల్ని ఇవ్వలేని దుస్థితికి చేరుకున్నాయి. అన్ని సంస్థలు అంతే… కొవిడ్ కారణంగా ప్రభుత్వ సంస్థ ఎయిర్‌ ఇండియా నష్టాల్లో కూరుకుపోయింది. దీంతో కేంద్రం ఆ సంస్థను ప్రైవేట్ పరం చేయానని ఈ ఏడాది ఐదుసార్లు బిడ్లను ఆహ్వానించింది. అయితే దేశ, విదేశీ సంస్థాగత మదుపరుల నుంచి ఆదరణ కరువే అయ్యింది. చివరకు విదేశీ భాగస్వామ్యంతో ఎయిర్‌ ఇండియా ఉద్యోగులే బిడ్‌ను దాఖలు చేయాల్సి వచ్చింది. అయితే టాటా గ్రూప్‌ రంగంలోకి దిగడం కొంతలో కొంత మోదీ సర్కారుకు ఊరటగా మిగిలింది. అప్పుల్లో కూరుకుపోయిన జెట్‌ ఎయిర్‌వేస్‌ పునరుద్ధరణపై కొత్త ఆశలు రేకెత్తాయి. వచ్చే ఏడాది వేసవిలో జెట్‌ విమాన సర్వీసులను నడిపేందుకు ప్రయత్నిస్తున్నామని సంస్థ కొత్త యాజమాన్యం ప్రకటించింది. ఏడాదిలో సంభవించిన పరిణామాలివే… మార్చి 23 నుంచి విమాన సేవలు నిలిచిపోయాయి. గోఎయిర్‌, విస్తారా సంస్థలు ఏప్రిల్‌లో ఉద్యోగులను జీతాల్లేని సెలవులపై పంపాయి. వేతనాల్లో ఎయిర్‌ ఇండియా 10 శాతం, స్పైస్‌జెట్‌ 10-35 శాతం, ఇండిగో 5-25 శాతం కోతలు విధించింది. మే 25 నుంచి దేశీయంగా విమానాలు మొదలయ్యాయి. ఇండిగో సంస్థ జూలైలో 10% సిబ్బందిని తొలగించింది. ఏప్రిల్‌ – సెప్టెంబర్‌లో ఇండిగోకు రూ.4,078 కోట్లు, స్పైస్‌జెట్‌కు రూ.712 కోట్ల నష్టాలు వచ్చాయి. దేశీయ విమాన సర్వీసులు ప్రస్తుతం 80 శాతమే నడుస్తున్నాయి. ఇంకా మొదలుకాని షెడ్యూల్డ్‌ అంతర్జాతీయ విమానాల సర్వీలు. వచ్చే ఏడాది మార్చికల్లా అంతర్జాతీయ సర్వీసులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి