ఓల్డ్ మలక్ పేట్ డివిజన్లో రీపోలింగ్.

 


గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పోలింగ్‌‌ నిలిచిపోయిన ఓల్డ్ మలక్‌పేట డివిజన్‌లో రీపోలింగ్‌కు రెఢీ అయ్యారు ఎన్నికల అధికారులు. డిసెంబర్ 1న జరగాల్సిన ఎన్నిక గుర్తు తారుమారుతో ఇవాళ నిర్వహిస్తున్నారు. ఓల్డ్‌ మలక్‌పేటలోని డివిజన్‌ నంబరు 26లో సీపీఐ అభ్యర్థి ఎన్నికల గుర్తుకు బదులుగా సీపీఎం గుర్తును ముద్రించారు. పోలింగ్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే దీనిని గుర్తించిన ఈ పార్టీ అభ్యర్థి పోలింగ్ నిర్వహణపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లడంతో డివిజన్‌ మొత్తం ఎన్నికను నిలిపి వేశారు.ఈనెల 3న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ స్టేషన్లు 69.. రీపోలింగ్‌ నిర్వహించాలని నిర్ణయించారు. మరీ కాసేపట్లో మొదలు కానున్న రీపోలింగ్‌కు అధికారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈసారి పక్కా జాగ్రత్తలు తీసుకుని పోలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. ఓల్డ్ మలక్‌పేటలోని 26వ డివిజన్‌లో ఏడుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా ఓల్డ్ మలక్‌పేట డివిజన్‌కు సంబంధించిన బ్యాలెట్‌పై నాలుగో అభ్యర్థిగా సీపీఐ నుంచి ఫిర్దౌస్‌ ఫాతిమా బరిలో ఉన్నారు. సీపీఐ అభ్యర్థులకు కంకి కొడవలి గుర్తును కేటాయించాలి. కానీ, ఇక్కడ సుత్తి కొడవలి, నక్షత్రం (CPM గుర్తు) గుర్తును కేటాయించారు. ఈ పొరపాటును ఒక పోలింగ్‌ కేంద్రం ద్వారం వద్ద అతికించిన బ్యాలెట్‌ జాబితాలో గుర్తించిన ఆ పార్టీ నేతలు వెంటనే విషయాన్ని పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆయన ఎన్నికల సంఘం కమిషనర్‌ సి.పార్థసారధికి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ డివిజన్‌కు సంబంధించి పోలింగ్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. వెంటనే రీపోలింగ్‌కు నిర్వహించాలని నిర్ణయించారు. ఓల్డ్ మలక్‌పేట డివిజన్‌లో పరిధిలో మొత్తం 54,655 మంది ఓటర్లున్నారు. ఇందులో పురుషులు 27,889 ఉంటే స్త్రీలు 26,763 కాగా, ఇతరులు 3 ఉన్నారు. ఇక్కడ పోలింగ్‌ను పూర్తిగా రద్దు చేయడంతో ఆరోజు ఓటు వేసినవారు కూడా మరోసారి ఓటును వినియోగించుకోవల్సి ఉంటుంది. కాగా, ఇక్కడ పోలింగ్‌లో పాల్గొన్న వారి ఎడమ చేతి చూపుడు వేలికి ఇప్పటికే సిరా గుర్తు వేసినందున ఇవాళ జరిగే పోలింగ్‌ రోజున ఓటర్లకు ఎడమ చేతి మధ్య వేలికి సిరా గుర్తు వేయాలని ఈసీ నిర్ణయించింది.