మిస్టరీగా మారిన వింత స్థంభం.

 


ఒక చోట మాయమై మరో చోట హాయ్ అంటున్న ‘మోనోలిత్'(ఏకశిల) ప్రపంచవ్యాప్తంగా పెద్ద మిస్టరీగా మారింది. తాజాగా ఈ వింత స్తంభం పోలాండ్ వాసులను పలకరించింది. పోలాండ్‌లోని విష్టులా నది ఒడ్డున ఒకటి.. కైల్స్ నగరంలోని నేచర్ రిజర్వ్ వద్ద మరొకటి కనిపించినట్లు అక్కడ ప్రజలు చెబుతున్నారు. గతంలో ఈ ఏకశిలను అమెరికా, యూరోప్ దేశాల్లోని పలు ప్రదేశాల్లో కూడా గుర్తించారు. పోలాండ్ స్థానిక మీడియా సమాచారం ప్రకారం 10 అడుగుల ఎత్తులో బూడిద రంగు ఉన్న ఈ మాయా స్తంభాన్ని.. జాగింగ్‌కు వచ్చిన వాళ్లు విస్టులా నది ఒడ్డున గుర్తించారు. ఎవరో తీసుకొచ్చి నది ఒడ్డున పాతినట్లుగా తెలుస్తోందని చెప్పారు. అలాగే కైల్స్ నగరంలోని నేచర్ రిజర్వ్ దగ్గరలోని సైట్‌లో పని చేస్తున్న ఓ ఉద్యోగి.. అక్కడ 9 అడుగుల ఎత్తు ఉన్న ఈ వింత స్తంభాన్ని గుర్తించాడని పేర్కొంది. గత కొద్దిరోజులుగా ‘మోనోలిత్’ పరిశోధకులను పరేషాన్ చేస్తోంది. మొదట అమెరికాలో దర్శనమిచ్చిన ఈ ఏకశిల.. ఆ తర్వాత అక్కడ నుంచి మాయమై రొమానియాలో.. తర్వాత బ్రిటన్‌లో ప్రత్యక్షమైంది. అసలు ఈ వింత స్తంభం ఎక్కడ నుంచి వచ్చింది.? లేదా ఎవరైనా తీసుకొచ్చారా.? అనేది తెలియక శాస్త్రవేత్తలు తలలు పట్టుకుంటున్నారు