పశ్చిమ బెంగాల్ లో బీజేపీ ‘పొలిటికల్ మిషన్’


 

పశ్చిమ బెంగాల్ లో బీజేపీ ‘పొలిటికల్ మిషన్’ ప్రారంభమైంది. శనివారం హోం మంత్రి అమిత్ షా రాకతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తింది. కోల్ కతా కు సుమారు 150 కి.మీ. దూరంలోని మెదినిపూర్ టౌన్ లో మధ్యాహ్నం జరిగిన భారీ ర్యాలీకి వేలాది మంది నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఇక్కడ స్వాతంత్య్ర సమర యోధులు ఖుదీ రామ్ బోస్, రామ్ ప్రసాద్ బిస్మిల్ లకు నివాళులు అర్పించిన అనంతరం అమిత్ షా.. వీరిని రాజకీయవాదులు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ రాష్ట్రంలో ప్రాంతీయ తత్వం పెరిగిపోయింది..సంకుచిత రాజకీయాలు పెడధోరణులను ప్రతిబింబిస్తున్నాయి అని ఆయన పరోక్షంగా పాలక తృణమూల్ కాంగ్రెస్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాష్ట్రం వీటిని విడనాడాలి అన్నారు. ఖుదీ రామ్ బోస్ లా దేశంకోసం ప్రాణాలర్పించే అవకాశం యువతకు ఎల్లప్పుడూ లభించకపోవచ్చునని, కానీ వారు ధైర్యంగా బోస్ దారిలో నడిచే మార్గాన్ని అనుసరించవచ్చునని ఆయన అన్నారు.భ్రష్ట రాజకీయాలు పనికిరావని పేర్కొన్నారు. బోస్ మీ రాష్ట్రానికి మాత్రమే చెందినవారు కారని, దేశానికే చెందినవారని, అలాగే పండిట్ రామ్ ప్రసాద్ బిస్మిల్ యూపీ కన్నా బెంగాల్ కే ఎక్కువగా చెందినవారని అమిత్ షా పేర్కొన్నారు. ప్రస్తుత నీచ రాజకీయాల గురించి ఈ ఫ్రీడమ్ ఫైటర్లు ఏ మాత్రం ఊహించి ఉండకపోవచ్ఛునన్నారు. బీజేపీని బయటి పార్టీగా ముద్ర వేస్తున్న తృణమూల్ కాంగ్రెస్ ను ఉద్దేశించి ఆయన పరోక్షంగా ఈ వ్యాఖ్య చేశారు. (బెంగాల్ లో బీజేపీ నేతలు, కార్యకర్తలకు తావు ఉండరాదని టీఎంసీ అదేపనిగా ప్రచారం చేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి). కాగా… అమిత్ షా బెంగాల్ లో సిద్దేశ్వరీ కాళీ మాత ఆలయంలోనూ, దేవీ మహామాయా టెంపుల్ లోను పూజలు చేశారు. రామకృష్ణ మిషన్ ఆశ్రమంలో స్వామి వివేకానందునికి శ్రధ్ధాంజలి ఘటించి ఆయన ప్రవచనాలను ప్రస్తావించారు.