జేఈఈ మెయిన్స్ పరీక్ష షెడ్యూల్ విడుదల.

 


జేఈఈ మెయిన్స్ పరీక్ష షెడ్యూల్ వచ్చేసింది. ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో సీట్ల కోసం నిర్వహించే ఈ పరీక్షల షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఈ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ముందుగా చెప్పినట్లుగానే నాలుగు సార్లు ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. దాని ప్రకారం తొలిసారి పరీక్ష ఫిబ్రవరిలో జరగనుంది. ఇక మిగిలిన మూడు దఫాలు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించనున్నట్లు ఎన్టీఏ తెలిపింది. దరఖాస్తు విధానం.. జేఈఈ మెయిన్స్‌ రాయాలనుకున్న విద్యార్థులు నాలుగు విడతల్లో జరిగే పరీక్షల్లో ఎన్నైనా రాసుకునే అవకాశాన్ని ఎన్టీఏ కల్పించింది. దాని ప్రకారం.. విద్యార్థులు తమకు నచ్చినన్ని సార్లు పరీక్ష రాసుకోవచ్చు. అయితే వారు రాసిన వాటిల్లో ఎందులో ఎక్కువ మార్కులు వస్తే దానినే స్కోరుగా పరిగణనలోకి తీసుకుంటారు. ఇక అన్ని పరీక్షలకు హాజరు కావాలనుకునే వారు ఒకే దరఖాస్తు ఫారాన్ని నింపాల్సి ఉంటుంది. నాలుగు పరీక్షలకూ కలిపి ఫిబ్రవరి సెషన్‌లోనే దరఖాస్తును సమర్పించవచ్చు. కాగా, విద్యార్థి దరఖాస్తు సమయంలోనే తాను హాజరు కాబోయే పరీక్షల సంఖ్యను స్పష్టంగా పేర్కొనాలి. ఆ మేరకు ఫీజును కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇదిలాఉండగా, జేఈఈ మెయిన్స్ సిలబస్‌లో మార్పులు చేయని ఎన్టీఏ.. ప్రశ్నపత్రంలో మాత్రం స్వల్ప మార్పులు చేసింది. ఆప్షన్ల సంఖ్యను పెంచేసింది. జేఈఈ మెయిన్‌ ఫిబ్రవరి షెడ్యూల్‌… దరఖాస్తుకు గడువు తేదీ: 2021 జనవరి 16 ఫీజు చెల్లింపునకు గడువు: 2021 జనవరి 17 పరీక్ష తేదీలు: 2021 ఫిబ్రవరి 23, 24, 25, 26 వెబ్‌సైట్‌: https://jeemain.nta.nic.in