కంకషన్ సబ్‌స్టిట్యూట్‌ అంటే ఏమిటి...?

 భారత్, ఆస్ట్రేలియా తొలి టీ20 మ్యాచ్ రసవత్తరంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో జడేజాకు కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన చాహల్ మ్యాచ్‌ను మలుపు తిప్పి..భారత జట్టుకు విజయం అందించాడు. అయితే ఈ కంకషన్​ సబ్​స్టిట్యూట్​ అంటే ఏంటి? దాని యొక్క విధి విధానాలు ఎలా ఉంటాయో చాలామందికి అవగాహన ఉండదు. ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఐసీసీ రూల్ ప్రకారం.. మ్యాచ్​ ఆడుతున్నప్పుడు ఎవరైనా ప్లేయర్‌కి తలపై లేదా మెడపై గాయమై.. తల తిరిగడం, తిమ్మిర్లు రావడం, మైకం కమ్మినట్లు అనిపిస్తే ఆ ప్లేయర్ కంకషన్​కు గురయ్యాడని భావిస్తారు. ఆ జట్టు మెడికల్ టీమ్ ఆ ఆటగాడిని పరీక్షించి అతని పరిస్థితిని అంచనా వేస్తారు. సదరు ఆటగాడు నిజంగానే కంకషన్​కు గురైతే అతని ప్లేసులో మరో ప్లేయర్‌ను గ్రౌండ్‌లోకి పంపేందుకు మ్యాచ్​ రిఫరీకి విన్నవించాల్సి ఉంటుంది. ఆ ఆటగాడు మ్యాచ్​లో ఎటువంటి పరిస్థితుల్లో కంకషన్​కు గురి కావాల్సి వచ్చింది? ఏ సమయంలో అలా జరిగింది? అతని స్థానంలో సరైన ప్రత్నామ్నాయ ప్లేయర్(బౌలర్ స్థానంలో బౌలర్, బ్యాట్స్​మన్ స్థానంలో బ్యాట్స్​మన్)గా ఎవరిని జట్టు ఆడించాలనుకుంటుంది? అనే అంశాలను రిఫరీకి తెలియజేయాలి. వాటన్నింటినీ పరిశీలించిన తర్వాత.. రిఫరీ అవి సరైనవే అని భావిస్తే కంకషన్ సబ్​స్టిట్యూట్​కు అనుమతిస్తాడు. ఈ మ్యాచ్​లో అప్పటికే జడేజా బ్యాటింగ్ కంప్లీట్ చేశాడు. అతడు మంచి బౌలర్ అన్న విషయం కూడా తెలిసిందే. దీంతో ఆసిస్ ఇన్నింగ్స్ అప్పుడు బౌలింగ్ వేసే వీలుండేది. అందుకే స్పిన్​ వేసే చాహల్​ను కంకషన్​ సబ్​స్టిట్యూట్​గా తీసుకున్నారు